Wednesday, November 20, 2024

AP: జ‌గ‌న్ తో రఘురామకృష్ణరాజు ఆప్యాయ ప‌ల‌క‌రింత..

హాయ్ జ‌గ‌న్ అంటూ షేక్ హ్యాండ్
అసెంబ్లీ ఆయ‌న సీటు ప‌క్క‌నే సిట్టింగ్
ప్ర‌తి రోజూ అసెంబ్లీకి రావాలంటూ హిత‌వు
సానుకూలంగా స్పందించిన జ‌గ‌న్
జ‌గ‌న్ ప‌క్క‌నే త‌న‌కు సీటు కేటాయించాలి
మంత్రి ప‌య్యావులు కేశ‌వ్ కు విన‌తి

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత‌ జగన్ పై ప్రతిరోజు విమర్శలు గుప్పించే టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయనతో ముచ్చటించారు. జగన్ అసెంబ్లీ ఆవరణలోకి వచ్చే సమయానికి అప్పటికే అక్కడ ఉన్న రఘురామ‌రాజు… ‘హాయ్ జగన్’ అని పలుకరించారు. జగన్ ముందుకు కదిలిన తర్వాత ఆయనతో పాటు వెళ్లి, ఆయన వరుసలో కూర్చున్నారు.

కాసేపట్లో గవర్నర్ ప్రసంగం ప్రారంభమవుతుందనగా లేచి వెళ్లి జగన్ పక్కన రఘురామ‌రాజు కూర్చున్నారు. జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడారు. ప్రతి రోజు అసెంబ్లీకి రావాలని జగన్ కు చెప్పారు. దీనికి సమాధానంగా జగన్ మాట్లాడుతూ… రోజూ అసెంబ్లీకి వస్తాను, మీరే చూస్తారని అన్నారు.

- Advertisement -

ఆ త‌ర్వాత ర‌ఘ‌రామ అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ… అసెంబ్లీకి ప్రతి రోజు రావాలని జగన్ కు చెప్పానని రఘురాజు మీడియాకు వివరించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే మజా ఏముంటుందని అన్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఇన్నర్ లాబీలో వెళ్తున్న శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడుతూ.. అసెంబ్లీలో జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని కోరారు. దీనికి సమాధానంగా అలాగేనని కేశవ్ నవ్వుతూ చెపుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత జగన్ పక్క సీటును మీరు ఎందుకు కోరుకుంటున్నారని రఘురామ‌రాజును మీడియా ప్రశ్నించగా… మజా ఉంటుందని, మీరే చూస్తారుగా అని వ్యాఖ్యానించారు. జగన్ ను రోజూ ర్యాగింగ్ చేస్తారా? అని పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే ప్రశ్నించగా ర్యాగింగ్ చేస్తానో, మరేం చేస్తానో మీరే చూస్తారుగా అని అన్నారు.

జగన్ కు షేక్ హ్యాండ్ ఎందుకిచ్చారని మీడియా ప్రశ్నించగా… అది తన ధర్మం అని చెప్పారు. మీ షేక్ హ్యాండ్ పట్ల జగన్ పాజిటివ్ గా రెస్పాండ్ కాలేదని మరికొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించగా.. జగన్ ఎలా రెస్పాండ్ అయినా, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడం తన ధర్మమని అన్నారు. అసెంబ్లీలో జగన్ పక్కన తనకు సీటు కేటాయిస్తే ఆయనకు అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెపుతానని తెలిపారు.

శాంతి భ‌ద్ర‌త‌ల‌పై జ‌గ‌న్ మాట్లాడ‌టం హాస్యాస్ప‌దం..

రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఉండి ఎమ్మెల్యే. ఢిల్లీలో ధర్నా చేస్తానని అంటున్నారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని అంటున్నారని… అసలు జగన్ చేస్తున్న ఈ డిమాండ్ ఏమిటో తనకు అంతుపట్టకుండా ఉందని చెప్పారు.


వినుకొండలో జరిగిన హత్యను ఒక పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో జగన్ కు ప్రజాభిమానం తగ్గలేదని చూపించుకునేందుకు కొందరికి డబ్బులిచ్చి, వారిని తీసుకొచ్చి, వారితో జగన్ కు దండాలు పెట్టించి, వాటిని పత్రికల్లో రాయించుకుంటున్నారని విమర్శించారు. నాగార్జునసాగర్ నిర్మాణానికి భూములు, నిధులు ఇచ్చిన రాజా వాసిరెడ్డి రామగోపాల్ కృష్ణ మహేశ్వరప్రసాద్ విగ్రహాన్ని ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement