న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వైఎస్సార్సీపీ తిరుగుబాటు నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మధ్య సాగుతున్న ట్వీట్ల యుద్ధం కాస్త మీడియా కెమేరాల ముందు విమర్శించుకునే వరకు చేరుకుంది. శుక్రాచార్యుడిలాగా దొంగలెక్కలు రాసే విజయసాయి రెడ్డి పరిస్థితి చూస్తుంటే తనకు జాలి కల్గుతోందని రఘురామ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి విజయసాయి రెడ్డి పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. విజయసాయి రెడ్డిలా తనకు నవయువతులతో ప్రేమాయణం జరిపే అవకాశం లేదని, తనకు తన వయస్సువారితోనే ప్రేమాయణం ఉంటుందని వ్యాఖ్యానించారు. విజయసాయి రెడ్డి ఎన్ని ట్వీట్లు చేసినా, ప్రైజ్ మనీ ఫిక్స్ అయిపోయిందని రఘురామకృష్ణ రాజు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. అల్పబుద్ధిగల వాడికి అధికారమిస్తే మంచివారిని వెళ్లగొడతారు అంటూ వ్యాఖ్యానించారు. ఉద్యోగులు తమ డిమాండ్లపై, అన్యాయాలపై తగురీతిలో స్పందించారని, ప్రజాభిప్రాయం సోషల్ మీడియాలో కనిపిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రికి తల్లి మనస్సు ఉంటే, చెల్లెలు న్యాయం కోసం రోడ్లపై ఎందుకు తిరుగుతోందంటూ సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారని రఘురామకృష్ణ రాజు అన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై ఆర్ధిక మంత్రి బుగ్గన ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 25న మరోసారి కలెక్టరేట్ల ముట్టడి తర్వాత ఉద్యోగులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉందని రఘురామ అన్నారు. తగ్గేదల్లే అంటూ ఉద్యోగులు కదం తొక్కుతున్నారని తెలిపారు. గతంలో ఐఆర్ కన్నా పీఆర్సీ సిఫార్సు ఎక్కువగా ఉండేదని రఘురామ గుర్తుచేశారు. ఏ ఉపాధ్యాయుడైనా భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాగలడని, కానీ ముఖ్యమంత్రి ఉపాధ్యాయుడు కాలేడని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ ఆదాయం విషయంలో అభూతకల్పనలు, అబద్ధాలు చెబుతున్నారని సీఎంపై మండిపడ్డారు. సీఎం తల్లి ప్రేమను సొంత చెల్లిపై చూపించి, ఉద్యోగులకు కావాల్సిన జీతాలు ఇవ్వాలని హితవు పలికారు.
తన రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. సరైన సమయంలో కీలక వ్యక్తుల ఆశీస్సులతో సరైన పార్టీలో చేరి, అప్పుడు వారి పని చెబుతాను అంటూ వ్యాఖ్యానించారు. బస్మాసురిడిలాగా ఒక్క వరం అంటూ, ఒక్క అవకాశం కోరిన వ్యక్తి ప్రజల నెత్తిపై చేతులు పెడుతున్నాడని మండిపడ్డారు. ఓటీఎస్ పథకం ద్వారా ప్రభుత్వ ఆదాయం కేవలం 25 లక్షలు మాత్రమే వచ్చిందని, ప్రజలను వేధించాలనుకునే ఏ పథకం కూడా విజయవంతం కాదని వ్యాఖ్యానించారు. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలే కాదు, రాష్ట్రప్రజలందరూ మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిగా మారాలని సూచించారు. అప్పుడే ప్రజలను వేధిస్తున్న బస్మాసురుడిని అంతం చేయవచ్చని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..