సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో టికెట్ల కేటాయింపుల గోల మొదలయ్యింది. ఆశపడ్డవారి కలలు చెదరటం… కథ మారటం సర్వసాధారణం. అధికారపార్టీలో అధినేతను లెక్కచేయక తిరుగుబావుటా ఎగరేసిన రఘురామకు ఇప్పుడు టికెట్టు దక్కకుండా పోయింది. ప్రతిపక్ష పార్టీ చేతిలో వజ్రాయుధం అనే ముద్ర సాధించిన నరసాపురం ఎంపీ కల చెదిరింది. కథ మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నరసాపురంలో వైసీపీ సంగతి తేల్చేస్తానని ప్రకటించిన రఘురామకు టిక్కెట్టు దొరకలేదు. త్రికూటమి పొత్తులో ఈ సీటు బీజేపీ వశం కాగా.. సొంత పార్టీ విశ్వాస పాత్రుడికే కాషాయ దళం పట్టం కట్టింది. దీంతో రఘురామకృష్ణరాజు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అయితే.. ఈ స్థితిలో మరో రాజుల కోట స్వాగతం పలుకుతోంది. రఘురామను విజయనగర సామ్రాజ్యాధినేతగా ప్రతిష్టించటానికి పసుపు సేన పావులు కదుపుతున్నట్టు సమాచారం అందుతోంది.
(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) – ఏపీలో ఎన్నికల పొత్తు.. బీజేపీ పాచికలో కంగుతిన్న నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణ రాజు స్థితి, గతి మారబోతోంది. విజయనగరం లోకసభ స్థానం వరించబోతోందనే కబురు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. ఏపీలో బీజేపీ ఆరు లోక్సభ స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. పొత్తులో విజయనగరం సీటు బీజేపీకి కేటాయించగా.. తర్వాత జరిగిన చర్చల్లోరాజంపేట సీటును కోరి మరీ బీజేపీ తీసుకుంది. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు విజయనగరం సీటు టీడీపీకి దక్కింది. సీఎం జగన్ను విభేదిస్తూ చంద్రబాబుకు సహకరించిన రఘురామకృష్ణ రాజుపై టీడీపీ మమకారం పెంచుకుంది. జగన్పై నిత్యం ఆరోపణల మిసైల్స్ సంధించే రఘురామ పార్టీకి ఎంతో అవసరమని టీడీపీ పెద్దలు భావించారు. దీనికి తోడు ఆర్థిక బలంలోనూ తిరుగులేని అభ్యర్థిగా పేరుంది. ఈ స్థితిలో రఘురామకు వెన్నుదన్నుగా నిలవటమే కాకుండా.. ప్రత్యర్థి వైసీపీ శిబిరంలో కలకలం రేపటానికి టీడీపీ వ్యూహం రచించింది. విజయనగరం సీటును తనకు ఇవ్వబోతున్నారనే సమాచారంతో రఘురామ సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారని సమాచారం.
విజయనగర సామ్రాజ్యంలోకి…
విజయనగరంలో రఘురామను బరిలో దించాలని చంద్రబాబు ఎందుకు ఆలోచిస్తున్నారంటే.. విజయనగరం నుంచి అభ్యర్థిగా మళ్లీ బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు విజయనగరం నుంచి గతంలో ఎంపీగా గెలిచారు. క్షత్రియ సామాజిక ఓటర్లు విజయనగరం పరిధిలోనే అత్యధికంగా ఉన్నారు. దీంతో విజయనగరం టీడీపీ సీటును రఘురామకు ఇస్తున్నారని కొద్ది గంటల్లోనే ప్రచారం మొదలైంది. తొలుత విజయనగరం నుంచి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పేరు పరిశీలనలో ఉంది. ఆయన సొంత నియోజకవర్గ ఎచ్చెర్ల అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో కళా లోక్సబకు పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. కానీ, కళా వెంకట్రావు అందుకు సిద్ధంగా లేరు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తెకు విజయనగరం అసెంబ్లీ సీటు ప్రకటించారు. అశోక్ గజపతి ఈసారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో రఘురామను విజయనగరం నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేది చర్చ జరిగింది. ఇదే విషయాన్ని చంద్రబాబు సీనియర్ నేత అశోక్ గజపతిరాజుతో చర్చించినట్లు తెలుస్తోంది. అశోక్ గజపతి కూడా రఘురామవైపే మొగ్గు చూపారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీ అధినేత తర్జన భర్జన
పొత్తులో భాగంగా రఘురామకు బీజేపీ టిక్కెట్టు నిరాకరించిన స్థితిలో తమ పార్టీ అవకాశం కల్పిస్తే కమలనాథులు ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. దీనికి ఈ స్థితిలో బీజేపీ నేతలతో చర్చించిన తర్వాతనే చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రఘురామ తమ పార్టీలో చేరలేదని, తమ పార్టీ నేతలను కాదని టిక్కెట్టు ఇవ్వటం సరికాదని బీజేపీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో టీడీపీలో చేర్చుకొని విజయనగరం సీటు ఇవ్వడం పైన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నిజానికి రఘురామకు ఏదోక నియోజకవర్గంలో సీటు ఇవ్వక పోతే వైసీపీ దూకుడు తట్టుకోలేమని, దీనికి తోడు నరసాపురంలో బీజేపీ అభ్యర్థి గెలవాలంటే.. ఎన్నికల్లో రఘురామ పోటీ చేయాల్సిందేనని టీడీపీ పెద్దలు వాదిస్తున్నారు. విజయనగరంలో రఘురామ గెలుపు ఖాయమని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ సీటుపైన చంద్రబాబు రెండు రోజుల్లోనే తన నిర్ణయం ప్రకటిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
అథోఃపాతాళానికి తొక్కక పోతే పేరు మార్చుకుంటా: రఘురామ వార్నింగ్
తనకు నర్సాపురం టికెట్ రాకుండా సీఎం జగన్ అడ్డుకున్నారని నరసాపురం ఎంపీ రఘురామ అన్నారు. బీజేపీ ఏపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు ద్వారా యత్నించి.. తనకు సీటు రాకుండా చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఓటమిని అంగీకరిస్తున్నానంటూ రఘురామ కామెంట్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్లో ఒక వీడియో విడుదల చేశారు. తనకు టికెట్ కేటాయించకపోవడం కొందరికి ఆనందాన్నిచ్చినా.. చాలా మంది బాధపడుతున్నారన్నారు. తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని, కానీ ఆన్సర్ చేయలేక పోతున్నట్టు తెలిపారు. మూడు అడుగులు వెనక్కి వేస్తున్నా.. నాలుగో అడుగు ప్రజల అండతో ముందుకు వేస్తానన్నారు. జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా అథోః పాతాళానికి తొక్కకపోతే పేరు మార్చుకుంటా అని చాలెంజ్ చేశారు.