ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు వరుసగా నాలుగో రోజు మరో లేఖ రాశారు. ఇప్పటికే ఆయన వృద్ధాప్య పింఛన్లు, సీపీఎస్ విధానం రద్దు, పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాల విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ జగన్‌కు లేఖలు రాసిన విషయం తెలిసిందే. తాజాగా రాసిన లేఖలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన ఈ రోజు కోరారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ విడుదల చేస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. అందుకే ఎన్నికల్లో వైసీపీకి నిరుద్యోగుల నుంచి మద్దతు లభించిందని తెలిపారు.
నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారని చెప్పారు. ఇప్పటికైనా ఉద్యోగాల భర్తీకి వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో 8,402 పోస్టులు, పశు సంవర్ధక శాఖలో 6,100 పోస్టులు, ఉపాధ్యాయ పోస్టులు 18,000, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు 6,000 భర్తీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.