ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వరుసగా మూడో రోజు మరో లేఖ రాశారు. ఎన్నికల హామీ వైఎస్సార్ పెళ్లికానుక – పెళ్లి కానుక, షాదీ ముబారక్ హామీని నిలబెట్టుకోవాలంటూ శనివారం లేఖ రాశారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకూ 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రూ.50 వేలను లక్షకు పెంచి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏ ఒక్క నిరుపేద వర్గం ఇంట్లో కూతురి వివాహానికి అండగా నిలబడలేకపోయారని విమర్శించారు. ఆర్ధిక ఇబ్బందులతో ఎందరో కూతుర్ల పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్ పేరు పెట్టి ఆయన పేరు, కీర్తిని అపహాస్యం చేయద్దని కోరారు. తక్షణమే వైఎస్సార్ పెళ్లికానుక బకాయి మంజూరు చేసి హామీ నిలబెట్టుకోవాలని సీఎం జగన్ ను లేఖలో రఘురామకృష్ణం రాజు కోరారు.
కాగా, ఇప్పటికే వైఎస్సార్ పెన్షన్ కానుక, సిపిఎస్ రద్దు హామీలు నెరవేర్చలేదని రఘరామ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. వృద్ధాప్య పింఛన్ల విషయంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ ఇప్పటికే ఆయన రెండు లేఖలు రాసిన విషయం తెలిసిందే.