నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంకా మిలటరీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. విడుదలలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో రఘురామను ఆయన తనయుడు భరత్, వ్యక్తిగత న్యాయవాది ఆస్పత్రిలో కలిశారు. రఘురామ ఆరోగ్యంపై ఎంపీ కుమారుడు భరత్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రఘురామ కృష్ణ రాజు ఆరోగ్యం మెరుగైనట్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. రేపు ఉదయం కింది కోర్టులో బెయిల్ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. సోమవారం సాయంత్రం లోగా మిలటరీ ఆస్పత్రి నుండి రఘురామ విడుదల కానున్నారు. రిలీజ్ ఆర్డర్ వచ్చే వరకు మిలటరీ ఆస్పత్రిలోనే రఘురామ కృష్ణ రాజు ఉంటారు.
కాగా, ఏపీ సీఐడీ పెట్టిన రాజద్రోహం కేసులో రఘురామకు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శనివారమే రఘురామ విడుదలవుతారని అంతా అనుకున్నా.. ప్రక్రియలో ఆలస్యంతో సోమవారం విడుదల కానున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎంపీ తరపు న్యాయవాదులు కింది కోర్టులో సోమవారం పూచీకత్తును సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రఘురామ రూ.లక్ష వ్యక్తిగత బాండు, ఇద్దరు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : కమల్ హాసన్‌కు ఊరట.. ఆ కేసును కొట్టివేసిన కోర్టు