రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. ఈ అప్పుల కుప్పతో వైసీపీ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని జోస్యం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వానికి సూచించారు. అప్పులు చేయడం కష్టంగా మారిందని, అయినప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని ప్రజలకు చెప్పాలని… వారు కచ్చితంగా అర్థం చేసుకుంటారని చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న కంపెనీలను పంపించే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరరాజా వంటి కంపెనీలే ఏపీ నుంచి వెళ్లిపోతే కొత్తగా ఎవరు వస్తారని రఘురాజు ప్రశ్నించారు. నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం కింద 100 ఎకరాల భూమి ఉందని… దాన్ని లీజుకు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నడిచే ఆలయాల భూములను తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇంత భూదాహం ఎందుకని ప్రశ్నించారు. దేవుడి సొమ్ముపై కన్నేశారని రఘురామ ఆరోపించారు.
ఈ వార్త కూడా చదవండిః ఎమ్మెల్యే గోరంట్లకు చంద్రబాబు ఫోన్!