విశాఖపట్నం, ప్రభ న్యూస్ బ్యూరో, జనవరి 9 : మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) బడ్జెట్ అత్యవసర సమావేశం మంగళవారం ప్రారంభ సమయంలోనే ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. జీవీఎంసీ కౌన్సిల్ హాల్ లో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అధ్యక్షతన సమావేశం ప్రారంభమై ప్రత్యేక కౌన్సిల్ కోసం ప్రారంభ ఉపన్యాసం చేశారు.
అయితే నగర పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా వీధులన్నీ చెత్తగా మారాయని, స్మార్ట్ సిటీ దుర్గంధ భరితంగా మారిందని టీడీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీ పక్ష కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వారికోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాకే బడ్జెట్ ప్రసంగానికి వెళ్లాలని వారంతా ఆందోళనకు దిగారు. మేయర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ వారి డిమాండ్లను బయటపెట్టారు. అయితే బడ్జెట్ సమావేశం ముగిశాక అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో కమిషనర్ సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహిద్దామని మేయర్ హామీ ఇవ్వడంతో ఆందోళనకు దిగిన కార్పొరేటర్లు శాంతించారు.