- తమాషాగా ఉందా… ఈ ఆన్సర్ రాసింది ఎవరు అంటూ డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు వ్యాఖ్యలు…?
- డిప్యూటీ మేయర్ వ్యాఖ్యలను ఖండించిన కమిషనర్
- సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయిన కమిషనర్ పులి శ్రీనివాసులు, అధికార యంత్రాంగం
- అర్ధ గంట సభ వాయిదా వేసిన మేయర్
గుంటూరు,ఆంధ్రప్రభ బ్యూరో: గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రగడ జరిగింది. కార్పొరేటర్ రోషన్ అడిగిన ప్రశ్నపై సభలో వాడి వేడి సమావేశం జరుగుతుంది. అజెండాలోని 32 ప్రశ్నకు అధికారులు ఇచ్చిన సమాధానం కౌన్సిల్ సమావేశంలో వివాదాన్ని రేపింది. నగరపాలక సంస్థ తరపున చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు చెల్లింపు అంశంపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా కార్పొరేషన్ పరంగా ఖర్చు చేసే విధానాలపై కార్పొరేటర్ వివరాలు అడిగారు. కాంట్రాక్టర్లకు చెల్లించే బిల్లులు ఆడిట్ అనంతరం కమిషనర్ సమక్షంలో బిల్లులు పద్ధతి ప్రకారం చెల్లింపులు జరుగుతాయని… అలానే కార్పొరేషన్ పరంగా ఖర్చు చేసే బిల్లులు అది విధాన పరమైన అంశమని అధికారులు సమాధానం చెప్పారు.
దీంతో నగర డిప్యూటీ మేయర్ వనమా బాల వజ్రబాబు (డైమండ్ బాబు) బైక్ తీసుకొని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాసిన వారు ఎవరు…? ఎట్ట కనపడుతున్నాం… తమాషాగా ఉందా… ఆ సమాధానం మమ్మల్ని అవమానించినట్టే ఉందని ఆగ్రహంతో ఊగిపోయారు. దీనిపై స్పందించిన కమిషనర్ పులి శ్రీనివాసులు కౌన్సిల్ అజెండాలోని ప్రశ్నలు మొత్తానికి సమాధానం విభాగాల హెచ్ఓడీలు ఇచ్చినప్పటికీ కమిషనర్ తరుపు బాధ్యత ఉంటుందని వివరించారు. అలానే గౌరవ సభలో అధికారులను తమాషాగా ఉందా అని ప్రశ్నించడం ఎవరో సభ్యులకు ఇది సమంజసం కాదని సమాధానం ఇస్తూనే… నీకు ఎటువంటి పూర్తి వివరాలు కావాలన్నా ఒక స్ట్రక్చర్ ప్రకారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నావని కమిషనర్ సమాధానమిచ్చారు.
మేము ప్రజా పాలకులం కార్పొరేషన్ పరంగా జరిగిన ఖర్చులపై అడిగే అధికారం ఉందని డిప్యూటీ మేయర్ వెల్లడించారు. అయినా అధికారులను అవమానపరిచే విధంగా తమాషాగా ఉందా అంటూ కేకలు వేయడంపై కమిషనర్ తమ మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటూ సభను బాయ్ కట్ చేస్తూ అర్ధాంతరంగా కమిషనర్ తో పాటు అధికార యంత్రాంగం అంతా వెళ్లిపోయారు. ఇప్పటివరకు అధికార, విపక్షాల మధ్య వాదోపవాదం జరిగితే ఒక వర్గం వారు మాత్రమే వెళ్ళిపోయేవారు. అధికారులు తమకు అవమానం జరిగిందని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పది నిమిషాల పాటు కౌన్సిల్ అంతా సైలెంట్ అయింది. దీంతో 12 : 25కు జరిగిన ఈ సంఘటనపై మేయర్ కావట్టి శివ నాగమనోహర్ నాయుడు సభను అర్థగంట వాయిదా వేశారు.