Friday, November 22, 2024

Raa… Kadiliraa – గిరిజ‌నుల 16 ప‌థ‌కాలు ఎందుకు ర‌ద్దు చేశారు….జ‌గ‌న్ ను నిల‌దీసిన చంద్ర‌బాబు

విశాఖపట్నం, జనవరి 20: తమ ప్రభుత్వం అరకు కాఫీని పరిచయం చేస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చి గంజాయిని పరిచయం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో నేడు జరిగిన టీడీపీ ‘రా కదలిరా’ బహిరంగ సభలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, తనుకు బాగా ఇష్టమైన ప్రాంతం అరకు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు నిలయం అరకు అని, ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ‘అరకు కాఫీ’ పేరును తానే పెట్టానని అన్నారు. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేశామన్నారు. టీడీపీ కాఫీని పరిచయం చేస్తే.. వైసీపీ గంజాయిని పరిచయం చేసిందని ఫైర్ అయ్యారు.

ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఒక్క మంచిపని అయినా చేశారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. బటన్‌ నొక్కడం తప్ప గిరిజనులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ”గిరిజన ప్రాంతంలో ఎక్కడైనా రహదారి వేశారా? సకాలంలో వైద్యం అందకపోవడంతో చిట్టంపాడుకు చెందిన గర్భిణి చనిపోయారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోవాలంటే అంబులెన్స్‌ పంపలేదు. స్కూటర్‌పై ఎక్కించుకొని ఇంటికి తీసుకుపోవాల్సిన పరిస్థితి. ఆయన నొక్కే బటన్‌ ఒకటి.. బొక్కే బటన్‌ ఒకటి. జగన్‌ దోచేది ఎక్కువ.. జనాలకు ఇచ్చేది తక్కువ. విద్యుత్‌ ఛార్జీలు ఐదు రెట్లు పెంచేశారు” అని చంద్రబాబు విమర్శించారు.

న‌మ్మించి మోసం చేశారు….

నమ్మించి మోసం చేసే వ్యక్తి జగన్‌ అని అన్నారు. అడ్డగోలుగా ధరలు పెంచి ప్రలజను దోచుకుంటున్నారని ఆరోపించారు. గిరిజనుల కోసం తాము 16 పథకాలు ప్రత్యేకంగా పెట్టామని.. ఐదేళ్ల పాలనలో 16 గిరిజన పథకాలను రద్దు చేసిన వ్యక్తి జగన్‌ అని ఫైర్ అయ్యారు చంద్రబాబు. ఈ 16 పథకాలను ఎందుకు రద్దు చేశారో జగన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకం కూడా రద్దు చేశారన్నారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్‌కు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే గిరిజనులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తుంటే దాన్ని కూడా తీసేశారని ఆరోపించారు చంద్రబాబు.

నైపుణ్యం కోసం ఏర్పాటు చేసిన శిక్షణాకేంద్రాలను సైతం జగన్ తీసేశారని విమర్శించారు చంద్రబాబు. గిరిపుత్రిక కల్యాణపథకం తీసుకొస్తే.. దాన్నీ రద్దు చేశారన్నారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చిన ఘనత టీడీపీది అని పేర్కొన్నారు. గిరిజనుల సహజ సంపద దోచుకునే వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. . కాగా, పోలవరం ప్రాంతాలన్నింటిని కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement