Friday, November 22, 2024

Raa … Kadiliraa – అభిమన్యుడు కాదు.. జగన్ భస్మాసురుడే – చంద్రబాబు

ఆంధ్రప్రభ స్మార్ట్, నెల్లూరు ప్రతినిధి – విధ్వంసం, తుగ్లక్ పాలన, సైకో ప్రవర్తనతో రాష్ట్రంలో అతలాకుతలం సృష్టించిన జగన్ మోహన్ రెడ్డి మళ్లీ బెదిరించే స్థితికి వచ్చారని, తాను సిద్ధ మంటూ కబుర్లు చెబుతుంటే టిక్కెట్టు వద్దని వైసీపీ నాయకులు పారిపోతున్నారని, వైసీపీ కార్యకర్తలారా మీరు కూడా రండి , కదలి రండి తెలుగుదేశం పిలుస్తోంది, రాష్ర్ట ప్రయోజనాల కోసం ఆహ్వానిస్తున్నా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రా.. కదలిరా కార్యక్రమంలో ఎజ్వీజీఎస్ కాలేజీ గ్రౌండ్స్‌ జన సంద్రంగా మారింది. నెల్లూరు రూరల్ జిల్లా కనపర్తిపాడు జెడ్పీ హెచ్ఎస్‌ వద్దకు హెలికాప్టర్‌లో చేరుకున్న చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబు ఈ సభలోసీఎం జగన్ పై తీవ్ర విమర్శలతో విరుచుకు పడ్డారు. ఏపీకి ప‌ట్టిన భ‌స్మాసురుడు.. విశాఖపట్టణంలో జరిగిన సభలో జగన్ మాట్లాడుతూ, తాను అభిమన్యుడిని కాదని, అర్జునుడని అన్నారని, కానీ జగన్ భస్మాసురుడని, ఒక్క చాన్స్ అడిగి ప్రజల నెత్తిన చెయ్యి పెట్టాడని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. మరో 72 రోజుల్లో ప్రజలే తమ ఓటుతో భస్మాసుర వధ చేస్తారని హెచ్చరించారు. మద్య నిషేధం అమలు చేస్తానని, సొంత బ్రాండ్లతో ప్రజల రక్తాన్ని తాగే సీఎంగా మారాడన్నారు.

బుగ్గ నిమిరి, నెత్తిపై చెయ్యి వేసి ఒక్క చాన్స్ కావాలని అడిగిన ఈ జగన్.. ఇప్పడు అందరినీ నాశనం చేశాడని, పోలవరం, రాజధాని, నదుల అనుసంధానాన్ని దెబ్బ తీశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద‌వాడు కాబ‌ట్టే.. అంతటా పెద్ద పెద్ద భ‌వంతులా?జగన్ పేదవాడంట, నిజమే అతడు పేదవాడే, పేద బిడ్డే, తినటానికి అన్నం లేదు, ఇల్లు లేదు,

అందుకే తాడేపల్లిలో, బెంగళూరులో, పులివెందులలో హైదరాబాద్లో… భవంతులు కట్టలేదా? రుషికొండకు బోడిగుండు కొట్టి 500 కోట్లతో సముద్రాన్ని వీక్షించే రీతిలో భవనం కట్టలేదా? ఇతడు పేద బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ, మరి ఆపరేషన్ చేయాలా? వద్దా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అన్నీ అబద్దాలు, అసత్యాలే చెబుతున్నాడని, ఈ పేద బిడ్డ పేదోళ్ల కడుపు కొట్టాడని, ఎన్టీఆర్ క్యాంటీన్లను మూసి వేశాడని, దేశంలోని సీఎంల అందరి ఆస్తులెంతో.. అంత ఆస్తికి వారసుడు పేదోడా? అని ప్రశ్నించారు.

- Advertisement -

పేదరికం లేని సమాజం ఎన్టీఆర్ కల అని, ఆ కలను నిజం చేయటం తన బాధ్యతని, పేదలను ఆర్థికంగా ఉన్నత స్థానంలోకి తీసుకు వస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అమ‌ర‌రాజా త‌ర‌లిపోయింది..గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి పారిపోయేలా బెదిరించాడని, అమరరాజా బ్యాటరీ ఇండస్ర్టీని ఇతర రాష్ట్రాలకు తరలిచించే పరిస్థితికి తీసుకు వచ్చారని ఆరోపించారు.

రైతులకు తీరని కష్టాలొచ్చాయని, ధాన్యం కొనుగోళ్లు లేవని, ధాన్యం కొనుగోళ్లకూ కమీషన్లు వసూలు చేస్తున్నారని, అప్పుల బాధ పెరిగిందని, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని, అందుకే టీడీపీ జనసేన అధికారంలోకి రాగానే రైతులకు రుణాలు మాఫీ చేస్తామని, ఆక్వారంగాన్ని ఆదుకుంటామని, రూపాయన్నరకే కరెంటు సరఫరా చేస్తామని, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు భృతిని చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి, నారాయణ, స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు ఈ సభలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement