Friday, November 22, 2024

Raa Kadiliraa … భూరక్ష కాదు… భూ భక్షణ చట్టం అది – చంద్రబాబు ప్రశ్న

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయనగరం ప్రతినిధి) – రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకు, సైకో జగన్ మధ్య ఎన్నికల పోరాటం జరుగుతోందని, రాష్ట్ర‌ ప్రజలు గెలవాలా? సైకో జగన్ గెలవాలా? జనమే తేల్చుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు. బొబ్బిలిలో మంగళవారం టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన రా కదిలి రా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపట్టిన భూరక్ష పథకం కాదని, భూ భక్ష పథకమని అభివర్ణించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో పెట్టుకొంటున్నారని, ఈ మీ ఆస్తిపై అతడి ఆషామాషీ ఏంటీ అని ప్రశ్నించారు. సర్వే జరిపించి సర్వేరాళ్లపై జగన్ ఫోటో పెడుతున్నారని, ఆయనకు మీ కుటుంబానికి ఏంటీ సంబంధం? జగన్ తాత, జగన్ అమ్మతో మీ సంబంధం ఉందా? ఆయన ఫోటో ఎందుకు పెడుతున్నారు? ఆయన వెంకటేశ్వర స్వామా? అని చంద్రబాబు చలోక్తులు విసిరారు. ఇక టెక్నాలజీ పేరిట భూముల రికార్డులు లేకుండా చేస్తున్నారని, 22 ఏ ప్రకారం ఈ భూమి మీదు కాదు, ఎల్లయ్యది అంటే… ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదన్నారు.

వారికి అధికారం లేదు..
ఆర్డీవోకి అధికారం లేదు, ఎమ్మార్వోకి అధికారం లేదు. మున్సిఫ్ కోర్టుకు అధికారం లేదు. హైకోర్టుకు వెళ్తే ఈ కేసు ఎప్పటికి తీరుతుందో తెలీదు, అలాంటి సైకోను మనం నమ్మాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. భూరక్ష చట్టాన్ని తారుమారు చేస్తున్నారని, టీడీపీ ఆధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని మారుస్తామన్నారు. విజయనగరంలో గిరిజన వర్సిటీ పూర్తి కాలేదు, భోగాపురం ఎయిర్ పోర్టును గాలికి వదిలేశారు. విశాఖపట్నాన్ని ఆర్థిక క్యాపిటల్ గా, ఐటీ, టూరిజం క్యాపిటల్ గా తీర్చిదిద్దాలని భావిస్తే.. గంజాయి క్యాపిటల్ గా, క్రైమ్ క్యాపిటల్ గా మార్చారని జగన్పై చంద్రబాబు విరుచుకు పడ్డారు. జగన్ కు ఉత్తరాంధ్రపై ప్రేమలేదని, ఆస్తులు, భూములపైనే మమకారం ఉందని, ఇప్పటికి రూ.40 వేల కోట్ల విలువ చేసే భూమిని కొల్లగొట్టారని, మెడపై కత్తిపట్టి భూములు రిజిస్ర్టేషన్ చేయించుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

ఓట‌మి భ‌యంతో అభ్య‌ర్థుల‌ను మారుస్తున్న వైసీపీ
పార్టీ ఓడిపోతుందనే 80 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చుతున్నారని, తన పాలన సరీగా ఉంటే అభ్యర్థులను ఎందుకు మార్చాలని, మంత్రులకే టిక్కట్లు ఇవ్వలేని స్థితి ఏర్పడిందన్నారు. రాజం ఎమ్మెల్యేను పాయకాపురం పంపించారని, ఇక్కడ గెలవనోడు, అక్కడ ఎలా గెలుస్తాడని. మీ ఇంట్లో చెత్త పక్కింట్లో బంగారం అవుతుందా ? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ సైకో ఓడిపోతాడని నిర్ధారణ జరిగిందని, కానీ ఏమరు పాటు వీడకూడదని, సైకోను సాగనంపటానికి ప్రజలు మెలుకువగా ఉండాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. అమరావతే రాజధాని అని , కానీ మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడారని, రాష్ర్టానికి రాజధాని లేకుండా ఈ దుర్మార్గుడు చేశాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement