న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తూర్పు కాపులు, గాజుల కాపులను కేంద్ర ఓబీసీ జాబితాలో అన్ని జిల్లాల్లో చేర్చమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాపుల ఓబీసీ రిజర్వేషన్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ బుధవారం సమాధానమిచ్చింది. తూర్పు కాపులను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చడంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి సుశిర్ ప్రతిమా భౌమిక్ తెలిపారు. రాజ్యాంగంలోని 342A(2) అధికరణ ప్రకారం కేంద్ర ఓబీసీ జాబితాలో వెనుకబడిన తరగతులను చేర్చడం లేదా తీసివేయడాన్ని రాష్ట్రపతి చట్టం ద్వారా చేయాల్సి ఉందని లిఖితపూర్వక జవాబులో పేర్కొన్నారు.
ప్రస్తుతం తూర్పు కాపులకు ఇస్తున్న కేంద్ర ఓబీసీ రిజర్వేషన్ మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే అమలవుతోంది. అన్ని జిల్లాల్లోని తూర్పు కాపులకు రిజర్వేషన్ కల్పించాలనిఅనేక సంవత్సరాలుగా కోరుతున్నారు. తూర్పు కాపుల జిల్లాల వారీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం స్పందించకుండా వారిని మోసం చేశాయని, ఈ విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సమాధానం చెప్పాలని ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. కాపులకు న్యాయం జరిగేందుకు తాను మరింత కృషి చేస్తానని, వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.