Tuesday, November 19, 2024

AP: ఎన్టీఆర్ జిల్లాలో క్వారీ ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

(ప్రభ న్యూస్, కంచికచర్ల) : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం పరిటాల సమీపంలోని దొనబండ కొండలలోని క్వారీలో ఇవాళ‌ ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. దొనబండ కొండపై క్వారీలో బండరాళ్ళకు డ్రిల్లింగ్ చేస్తుండగా పెద్ద మొత్తంలో బండరాళ్లు జారి పడటంతో, పెద్దపెద్ద బండరాళ్ల కింద పడి డ్రిల్లింగ్ చేస్తున్న ముగ్గురు క్వారీ కార్మికులు దుర్మరణం చెందారు. మృతదేహాలు పెద్ద పెద్ద బండ రాళ్ల గుట్టల్లో చిక్కుకుపోయాయి. ప్రోక్లైన్లు, పెద్దపెద్ద మిషన్ల ద్వారా బండరాళ్లను తొలగించి మృతదేహాలను వెలికితీసే పనిలో క్వారీ యాజమాన్యం, పోలీసులు నిమగ్నమయ్యారు. క్వారీలో కార్మికులు మృతి చెందిన‌ వార్త ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది. పొట్ట చేత పట్టుకొని వేరే రాష్ట్రాల నుంచి బ్రతుకుతెరువు కోసం ఇక్కడికి వచ్చి క్వారీలలో కార్మికులుగా పనిచేస్తున్న వారి జీవితాలు కొండల్లోని బండ రాళ్ళల్లో తెల్లారాయి.

ఇవాళ‌ ఉదయాన్నే జరిగిన అత్యంత విషాదకర సంఘటన వివరాలిలా ఉన్నాయి… కంచికచర్ల మండలం పరిటాల సమీపంలో దొనబండ పవన్ క్రషర్ కు చెందిన క్వారీలో బ్లాస్టింగ్ పూర్తయింది. బ్లాస్టింగ్ పూర్తయిన అనంతరం ఏర్పడిన పెద్దపెద్ద బండల స్లాబులను చిన్నవిగా చేసి బ్లాస్ట్ చేసేందుకు సోమవారం ఉదయాన్నే క్వారీకి చేరుకున్న నలుగురు కార్మికులు హోల్స్ పెడుతున్నారు. జి.కొండూరు మండలం చెరువు మాధవరంకు చెందిన డ్రిల్లింగ్ యజమాని బత్తుల దుర్గా రాజ్ (23), ఒరిస్సా రాష్ట్రానికి చెందిన‌, ప్రస్తుతం జి కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో నివాసం ఉంటున్న డ్రిల్లర్ బిబి నాయక్ (42), చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన‌, ప్రస్తుతం చెవుటూరులోనే నివాసం ఉంటున్న రామ్ దేవ్ భాగేల్ (33)లు పెద్దపెద్ద బండరాళ్లకు హోల్స్ పెడుతున్నారు. అయితే అప్పటికే బ్లాస్టింగ్ చేసి ఉన్న పెద్ద పెద్ద బండలకు హోల్స్ పెడుతున్నందున, బ్లాస్టింగ్ కు కదిలిపోయి లూజుగా ఉన్న పెద్ద పెద్ద బండ రాళ్లన్నీ ఒక్కసారిగా జారి కొండ నుండి దిగువ భాగానికి పడిపోయాయి. పెద్ద పెద్ద బండలతో పాటు బండరాళ్లకు హోల్స్ పెడుతున్న ముగ్గురు కార్మికులు కూడా పైనుంచి కిందకు జారి పడిపోయారు.

దీంతో దుర్గారాజ్, బీబీ నాయక్, రామ్ దేవ్ భాగేల్ లు పెద్ద పెద్ద బండరాళ్ల కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. అయితే వీరితో పనిచేస్తున్న మరో వ్యక్తి ఈ ప్రాంతానికి దూరంగా ఉండటంతో అతను క్షేమంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న కంచికచర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్వారీ యజమానుల సహకారంతో బండరాళ్ల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను పెద్దపెద్ద యంత్రాలతో వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. గత కొద్దిరోజులుగా నిరంతరంగా వర్షాలు పడుతుండటంతో పాటు ముందుగానే బ్లాస్టింగ్ జరగడం ద్వారా కదిలిపోయిన కొండరాళ్ల బ్లాక్స్ కు హోల్స్ వేస్తున్నందున, ఒక్కసారే బండరాళ్లన్నీ జారి కిందపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూలి నాలి చేసుకునే కార్మికులు క్వారీలలో దుర్మరణం చెందడంతో కార్మికుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

- Advertisement -

కాగా క్వారీలలో బ్లాస్టింగ్ చేసే కార్మికులకు, బ్లాస్టింగ్ కోసం హోల్స్ వేసే కార్మికులకు సరైన ప్రమాద రక్షణ సౌకర్యాలు ఏర్పర్చక పోవడం వల్లే నిత్యం క్వారీలలో ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలున్నాయి. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. మైనింగ్ తో పాటు వివిధ శాఖల అధికారులు ఈ విషయాలపై దృష్టి సారించి క్రషర్, క్వారీలలో పనిచేసే కార్మికుల జీవితాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement