శ్రీ సత్య సాయి బ్యూరో (ప్రభన్యూస్) : భార్యాభర్తల మధ్య గొడవకు రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండల పరిధిలో ఇవ్వాల (సోమవారం) చోటు చేసుకుంది. కదిరి రూరల్ సిఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
నంబుల పూలకుంట మండలం కొత్తపల్లి పంచాయతీలోని మల్లెం వారి పల్లికి చెందిన శ్రావణి ని అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలోని దేవలంపల్లి గ్రామానికి చెందిన గణేష్ నాయుడుకు మూడేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేశారు. వారికి సాత్విక అనే రెండేళ్ల చిన్నారి ఉంది. కుటుంబ ఆర్థిక లావాదేవీల కలహాలలో భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. గణేష్ నాయుడు కుటుంబ సభ్యుల నుంచి శ్రావణి కుటుంబ సభ్యులు కొంత నగదును తీసుకొని, తిరిగి ఇవ్వలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది.
ఇందులో భాగంగానే భార్యాభర్తలు ఇరువురు గత కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో నిన్న (ఆదివారం) గణేష్ నాయుడు శ్రావణి కి ఫోన్ చేసి మాట్లాడే సమయంలో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. చివరిగా తాను రేపు అనగా సోమవారం వచ్చి తన కూతురు ను తీసుకెళ్తానని ఫోన్లో చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రావణి తన రెండేళ్ల చిన్నారి సాత్వికతో పాటు గ్రామ సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
విషయం తెలుసుకున్న శ్రావణి తల్లి బావి వద్దకు వెళ్లి గట్టిగా కేకలు వేయడంతో అదే సమయంలో ఆటో తోలుకొని వెళ్తున్న ఆటో డ్రైవర్ అక్కడికి చేరుకొని, బావిలో దూకిన శ్రావణిని రక్షించగలిగారు. అయితే సాత్విక అనే రెండేళ్ల చిన్నారి బావి నీళ్లలోని పాచికలో ఇరుక్కోవడం వలన ఊపిరి ఆడక మృతి చెందింది. దీంతో శ్రావణి కుటుంబంలోనూ అదే విధంగా మల్లెంవారి పల్లి గ్రామంలోని తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలిసిన కదిరి రూరల్ సీఐ వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షించి చిన్నారి మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.