Friday, November 22, 2024

AP | నవజాత శిశువులకు నాణ్యమైన వైద్యం… శిశు మరణాలు కట్టడిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

అమరావతి, ఆంధ్రప్రభ : నవజాత శిశువులకు ప్రైవేటులో వైద్య ఖర్చులు లక్షల్లో ఉంటాయి. రెండు రోజులు ఎన్‌ఐసీయూ (న్యూ బోర్న్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ లో ఉంచితే లక్ష రూపాయలు అదే వారం అయితే రూ.3 నుంచి రూ.5 లక్షలు ఖర్చవుతోంది. నెలలు నిండకుండా పుట్టిన బిడ్డల వైద్య కోసం రూ.10 లక్షల పైనే ఖర్చు చేసిన తల్లిండ్రులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ఖరీదైన వైద్యాన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నారు. కార్పొరేట్‌కు మించిన సౌకర్యాలతో స్పెషల్‌ న్యూ బోర్న్‌ కేర్‌ యూనిట్‌ అందుబాటులోకి తెచ్చారు.

బిడ్డ పుట్టిన తరువాత ఊపిరి తిత్తులు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకొనేందుకు అవసరమైన రూ.15 విలువగల ఇన్‌జంక్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు. గర్భిణీ ఆవర నెల ఏడవ నెలలో డెలివరీ అయిన శిశువులను కాపాడుకొనేందుకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. సుమారు 5 లక్షలు ఖరీదైన వైద్యాన్ని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవం అయి సమస్య ఎదురైన వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి ఉచిత వైద్యసేవలు పొందుతున్నారు.

రూపాయి ఖర్చు లేకుండా కార్పొ’రేట్‌’కు మించిన వైద్యాన్ని ఉచితంగా అందిస్తుండటం నవజాత శిశువుల పాలిట వరంలా పరిణమించింది. రాష్ట్రంలో శిశు మరణాల నివారణే లక్ష్యంగా సీఎం జగన్‌ ప్రభుత్వం గడిచిన నాలుగున్నరేళ్లలో తీసుకున్న చర్యలు ఫలించాయి. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ఆ బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేరుకునే వరకూ అడుగడుగునా ప్రభుత్వం చేయిపట్టి నడిపిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వాసుపత్రుల్లో పీడియాట్రిక్‌ (చిన్న పిల్లల) వైద్య విభాగాలను బలోపేతం చేస్తోంది.

వార్డుల్లో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, పూర్తిస్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించింది. దీంతో.. టీడీపీ ప్రభుత్వ హయాం తో పోలిస్తే స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్స్‌ (ఎస్‌ఎన్‌సీయూ)లో శిశు మరణాల రేటు ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 2018-19లో ఎస్‌ఎన్సీయూల్లో ప్రతి వెయ్యి జననాలకు శిశు మరణాల రేటు 12.3గా ఉండగా 2019 నుంచి సీఎం జగన్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ మరణాల రేటు క్రమంగా తగ్గుతూ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య 6.6కు తగ్గింది.

- Advertisement -

భారీగా పెంచిన పడకలు.

నవజాత శిశు మరణాల నియంత్రణా చర్యల్లో భాగంగా ప్రభుత్వాసుపత్రుల్లో నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఎసీ యూ)లలో పడకలను వైద్యశాఖ 2019కు ముందు.. రాష్ట్రంలో 62 ఎస్‌ఎన్సీయూల్లో 585 పడకలు అందుబాటులో ఉండేవి. వీటికి అదనంగా వార్డులను ఏర్పాటుచేస్తూ 755కు ప్రభుత్వం పడకలకు పెంపొందించింది. మరోవైపు.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో శిశు సంరక్షణ కేంద్రాల బలోపేతం చేపట్టింది.

భాగంగా 11 ప్రభుత్వాస్పత్రుల్లో 20 పడకల చొప్పున, మరో 8 ఆస్పత్రుల్లో 10 పడకల ఎన్‌ఎసీయూ నాలుగు ఆస్పత్రుల్లో 20 పడకల చొప్పున ఎన్‌ఏసీయూ ఏర్పాటు చేసింది. వీటిల్లో వైద్యసేవలు అందించడానికి 250 మంది వరకూ వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఇతర సహాయ సిబ్బంది పోస్టుల భర్తీ చేపట్టారు. సీప్యాప్‌, ఫొటోథెరపీ యూనిట్‌, రేడియంట్‌ వార్మర్‌, ఇతర అత్యాధునిక పరికరాలను సమకూర్చారు. ఈ యూనిట్లలో త్వరలో వైద్యసేవలు ప్రారంభించనున్నారు.

తప్పిన తిప్పలు

పూర్తిస్థాయిలో ఈ మరణాలను నియంత్రించడానికి వైద్యశాఖ చర్యలు చేపడుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనతికాలంలో ఎస్‌ఎన్సీయూల్లో శిశు మరణాలను గణనీయంగా నియంత్రించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల కేంద్రం సైతం అభినందించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైద్య విప్లవం ప్రారంభమైంది. ఫ్యామిలీ డాక్టర్ల విధానంతో పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువయ్యాయి.

రాష్ట్ర వ్యాపితంగా 10,032 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేశారు. దీంతో పల్లె ప్రజలు వైద్య కోసం పట్టణాలకు పరుగులు తీయాల్సిన అవస్థలు తప్పాయి. మతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓల ద్వారా గర్భిణీ దశ నుంచే ప్రత్యేక వైద్య సేవలు అందిస్తోంది. క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందించడంతో తల్లి బిడ్డల ఆరోగ్యం భద్రంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలోనే హైరిస్క జిల్లాగా విశాఖ జిల్లాను గుర్తించిన ఆరోగ్య శాఖ ఉమ్మడి విశాఖ జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఏటా అల్లూరి జిల్లాలో పదుల సంఖ్యలో మాతా శిశు మరణాల ప్రభావం అధికంగా ఉండడంతో ఆయా కేసులన్నీ రెఫరల్‌గా విశాఖ కేజిహెచ్‌ తరలిస్తూ ఉంటారు కేజీహెచ్‌ కు వచ్చే నవజాత శిశువులకు పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందజేసేందుకు అన్ని చర్య లు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హెచ్పీసీఎల్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద 80 లక్షలతో రూపాయలతో ప్రత్యేకంగా ఈ వార్డుకు సంబంధించి అవసరమైన అన్ని రకాల వైద్య పరికరాలను వెంటిలేటర్లను ప్రత్యేక పడకలను ఏర్పాటు చేశారు.

గతం కంటే భారీగా తగ్గిన శిశు మరణాలు

ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతిష్టాత్మక చర్యల్లో భాగంగా అన్ని ఆసుపత్రుల్లో స్పెషల్‌ న్యూ బోర్న్‌ కేర్‌ యూనిట్స్‌ తో పాటునియోనాటిల్‌ ఇంటెన్స్‌ కేర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడంతో గతం కంటే ప్రస్తుతం శిశు మరణాల సంఖ్య భారీగా తగ్గింది. గతంలో ఏడాదికి 40 నుంచి 50 వరకు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య పది నుంచి 20 కి చేరిందని కేజీహెచ్‌ పీడియాట్రిక్స్‌ వైద్యులు తెలుపుతున్నారు. పూర్తిస్థాయిలో వచ్చిన పరికరాలను వినియోగించుకుంటూ శిశు మరణాలను తగ్గించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement