Saturday, November 23, 2024

నాణ్యమైన విద్యతోనే బంగారు బాట.. తిరువూరు బహిరంగ సభలో సీఎం జగన్‌

ఎన్టీఆర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : నాణ్యమైన చదువులతో భావితరాల భవితకు బంగారు బాటలు వేసి.. ఆయా కుటుంబాలు సుస్థిర ప్రగతి దిశగా పయనించేలా చేయడమే వైసీపీ ప్రభుత్వం ధ్యేయమని, పేదరికం, ఆర్ధిక సమస్యలతో ఏ పేద విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే తమ ప్రథమ లక్ష్యమని, అందుకే మన బడి నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల స్థితి గతులను సమూలంగా మార్చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. మంచి చదువులతో అన్నీ సాధ్యమే అన్న దానికి ఉదాహరణ వేదికపై కూర్చొన్న ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీ రావ్‌. సాధారణ కుటుంబంలో పుట్టి చక్కగా చదువుకుని, నేడు కలెక్టరై ఒక జిల్లా పాలనాధికారిగా మారారు. ప్రతి పేద విద్యార్థి ఇలా ఎదగాలన్నదే నా ఆకాంక్ష అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వెల్లడించారు.

ఒక మనిషి పేదరికం నుంచి బయటపడాలంటే చదువే ఏకైక మార్గమని, అలాంటి నాణ్యమైన చదువులను ప్రభుత్వ పాఠశాలల ద్వారా ఉచితంగా ఇచ్చేందుకు అనుక్షణం పనిచేస్తున్నామని వివరించారు. జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కోసం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రసంగించారు. 698.68 కోట్ల నిధులను 8,83,723 మంది తల్లుల ఖాతాల్లోకి నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ నిధుల విడుదలతో 9,86,001 మంది విద్యార్థుల లబ్ధి పొందినట్లు సీఎం జగన్‌ సభలో వివిరించారు. దేశంలో విద్యాదీవన, వసతి దీవెన లాంటి పథకాలు ఎక్కడా లేవని ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తప్ప ప్రవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సాయం చేయడం లేదని వివరించారు.

- Advertisement -

గతంలో ఫీజు రియింబర్స్‌ మెంట్‌ బిల్లులు పెండింగ్లో ఉంచి, బకాయిలు పెట్టేవారని గుర్తు చేశారు. దీంతో ప్రవేటు యాజమాన్యాల ఒత్తిడి భరించలేక పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువులు మానేసే పరిస్థితి ఉండేదని మన ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి ఎన్నటికీ రానివ్వనని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే ఏ పథకమైనా లంచాలు, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే చేరవేస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఫీజలు కట్టలేక, పిల్లలకు మంచి చదువులు చెప్పించలేక కొంత తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలున్నాయని వివరించారు. అందుకే మన ప్రభుత్వం విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

జగనన్న విద్యా దీవెన కింద 9,947 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వం కేవలం జగనన్న విద్యాదీవెన పథకం కింద ఇప్పటివరకు రూ.9,947 కోట్లు పేద విద్యార్థుల కోసం చెల్లించినట్లు సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్రంలోని 27 లక్షల మంది విద్యార్థులకు నేరుగా లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు పెండింగ్లో ఉంచిన బకాయిలను కూడా తమ ప్రభుత్వమే చెల్లించినట్లు సీఎం జగన్‌ వివరించారు. బోర్డింగ్‌ ఖర్చుల కోసం విద్యాదీవెన పథకం కింద హాస్టల్‌ ఖర్చులను కూడా చెల్లిస్తున్నామని తెలిపారు. అక్టోబర్‌ – డిసెంబర్‌ 2022 త్రైమాసికానికి 9.86 లక్షల మంది విద్యార్ధులకు రూ.698.68 కోట్లను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఆదివారం జమ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement