శ్రీ సత్యసాయి బ్యూరో,ప్రభన్యూస్ః
ప్రసిద్ధి చెందిన శ్రీ సత్య సాయి జిల్లాలో కదిరి పట్టణంలో గల శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం చంద్రగ్రహణం కారణంగా శనివారం మూసివేశారు.శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆశ్వీజ మాసము బహుళ పౌర్ణమి 28.10.2023 వతేది శనివారము రాత్రి రాహు గ్రస్త, పాక్షిక చంద్ర గ్రహణం రేవతి నక్షత్రములో సంభవించుచున్నది.
ఈ గ్రహణంరాత్రి 1.05 ని||కు స్పర్శ కాలము అగుచున్న వలన చంద్రగ్రహణమునకు పూర్వము మూడు యామములకు పూర్వము (9.00 గం||ల మునుపు) అనగా 28.10.2023 వతేది శనివారము ఉదయం శ్రీవారికి నిత్య కైంకర్యములు యదావిధిగా పూర్తి చేసి, మధ్యహ్నం 3.00 గం||లలోపు శ్రీవారి ఆలయము తలుపులు మూసివేయబడును. రాత్రి కైంకర్యములు జరుపబడవు. గ్రహణానంతరము మరుసటి రోజు అనగా 29.10.2023 వతేది ఆదివారము గ్రహణ మోక్షకాలము అనంతరం ఉదయం 6.00 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు తెరచి, నిత్య ప్రత్యాబ్దికములు గావించి, ఆలయ పుణ్యహవాచనము శుద్ది, ఆలయ సంప్రోక్షణ జరిపి, పరివార దేవతలకు పుళికాపు తిరుమంజనములు కావించి, శ్రీవారికి నివేదన, ఆరాధన అనంతరము శ్రీస్వామి వారి దర్శనము 29.10.2023 వతేది ఆదివారం ఉదయము 9.00 గంటల నుండి భక్తాదులకు యథావిధిగా శ్రీస్వామి వారి దర్శనములు కొనసాగించబడును. కావున భక్తాదులందరికి తెలియజేయుడం ఏమనగా చంద్ర గ్రహణము సందర్భముగా శ్రీస్వామి వారి దర్శనము 28.10.2023 మ||.3.00 గం|| నుండి 29.10.2023 ఉదయము 8.00 గం|| వరకు నిలుపుదల చేయు విషయమును గమనించగలరని ఆలయ పాలకమండలి ఛైర్మెన్ జెరిపిటి గోపాల క్రిష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి వెండి దండి శ్రీనివాస రెడ్డి సంయుక్తంగా తెలియజేశారు.