Friday, November 22, 2024

మురుగు కాల్వ ప‌క్క‌న పురిటిబిడ్డ‌.. మ‌గ‌బిడ్డ‌ను కాద‌నుకున్న‌ క‌ర్క‌శ‌త్వం

మానవత్వం మంట కలిసింది. పేగు బంధం మ‌రిచి, అభంశుభం తెలియని పురిటి బిడ్డను మురుగు కాలువ పక్కన చెత్త కుప్ప వద్ద వదిలేసి వెళ్లారు. ఎపుడు, ఎందుకు, ఎవ‌రు వదిలారో తెలియదు. చివరకు ఆ శిశువు శ‌వంగా మారాడు. ఆ నోటా, ఈ నోటా ఈ స‌మాచారం కాస్త‌ పోలీసుల దాకా వెళ్లింది. వారు అక్కడకు వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన శిశువును మున్సిపాలిటీ వారికి అప్పగించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం వెలుగు చూసింది.

శ్రీకాళహస్తి, ప్రభ న్యూస్ : శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని కొండమిట్ట ప్రాంతంలో ఓ పాడు పడిన ఇంటి పక్కగా మురుగు కాలువ వెళుతోంది. కాలువ సమీపంలోనే చెత్త దిబ్బ కూడా ఉంది. ఈ దిబ్బ సమీపంలో మురుగు కాలువ పక్కనే గుర్తు తెలియని వ్యక్తులు ఓ మగ శిశువును వదలిపోయారు. ఆ శిశువు పక్కనే ఓ గోనె సంచి… తాటాకుల బుట్ట కూడా ఉంది. అక్కడ పరిస్థితిని బట్టి చూస్తే… శిశువు జన్మించిన కొద్ది సేపటికే సంచిలో ఉంచి అక్కడ పడేసినట్లు తెలుస్తోంది.

ఆ పరిసర ప్రాంతాల వారు చూసే లోపే ఆ శిశువు మృతిచెంది ఉన్నాడు. కన్నవారు చంపి అక్కడ పడేశారా? లేక చని పోయిన తరువాత అక్కడ పడేశారో తెలియడం లేదు. ఇలా ఎవరు చేశారో అంతు బట్టడం లేదు. ఈ మృత శిశువును చూసి స్థానికులు కొందరు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. చుట్టు పక్కల విచారించారు. ఆ ప్రాంత ప్రజలు తమకు తెలియదని చెప్పడంతో మృత శిశువును దహన సంస్కారాల కోసం పురపాలక శాఖ వారికి అప్పగించారు. ఈ ఘటన ఎలా జ‌రిగింద‌న్న దానిపై పోలీసులు అరా తీస్తున్నారు. కాగా, ఇది చిత్తూరు జిల్లాలోనే హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement