Friday, September 20, 2024

AP | వ‌చ్చేనెల‌ 1 నుంచి ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ళు..

అమరావతి, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు ప్రక్రియను అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు. సుమారు 37 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

విజయవాడలో శుక్రవారం సాయంత్రం పౌరసరఫరాల శాఖ వర్క్‌షాప్‌లో పౌర సరఫరాల శాఖ ఎండీ వీరపాండియన్‌, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ మంజిర్‌ జిలానీ సమూర్‌, పది జిల్లాల మార్కెటింగ్‌, సహకార, వ్యవసాయ శాఖల అధికారులతో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలుకు అనుసరించాల్సిన విధివిధానాలపై వర్క్‌ షాపు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మనోహర్‌ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో ఈ వర్క్‌షాపులు నిర్వహిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకీ గౌరవం ఇచ్చే విధంగా, కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను ఉపయోగించి ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కొనుగోళ్లు పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశామన్నారు.

రైతు సహాయక కేంద్రాల సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు క్షేత్రస్థాయిలో రవాణాకి ఇబ్బందులు లేకుండా పెద్ద సంఖ్యలో లారీలు సిద్ధం చేస్తున్నాం. జీపీఎస్‌కి అనుసంధానం చేసి ప్రతి బస్తా ట్రాన్స్‌పోర్టు డేటా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు. పూర్తిస్థాయిలో సంచులు సిద్ధం చేస్తున్నామన్నారు

ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో జమ

- Advertisement -

రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి పూర్తిస్థాయిలో సాంకేతికత సహకారం తీసుకుంటున్నామన్నారు.

రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ధాన్యం అమ్మకం నుంచి మిల్లు ఎంపిక చేసుకునే వరకు రైతుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చే విధంగా ఈ ప్రణాళికలు ఉండబోతున్నాయన్నారు. రైతుకి భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా తగ్గకుండా నిజాయతీగా ప్రజల పక్షాన నిలబడ్డామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement