Friday, November 22, 2024

BJP: ఏపీలో ఎన్నికల శంఖారావం పూరించిన పురందరేశ్వరి..

ఏలూరు బ్యూరో ప్రభ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల శంఖరావాన్ని పూరించింది. ఏకకాలంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని భీమవరంలో వర్చువల్ పద్ధతిలో రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలను గురువారం ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఎల్ ఇడి స్క్రీన్ లద్వారా పురంధరేశ్వరి సందేశాన్ని వీక్షించారు. తొలుత బీజేపీ శ్రేణులు భీమవరం పట్నంలో 5కి.మీ మేర భారీ ర్యాలీ నిర్వహించారు.

పురంధరేశ్వరికి పార్టీ శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పురందరేశ్వరి మాట్లాడుతూ.. శంఖం పూరించడం ద్వారా ఎన్నికల నగారా మోగించామని తెలిపారు. ఒకేసారి 25 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వారసత్వ నాయకత్వానికి బీజేపీలో తావు లేదని, తండ్రి తర్వాత కొడుకు అనేలా బీజేపీ లో ఉండదన్నారు. కష్టపడ్డ కార్యకర్తకు మాత్రమే ఈ పార్టీలో గుర్తింపు ఉందని స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్ లలో అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. 2014 ముందు స్కాముల పర్వం దేశంలో కొనసాగిందని, 2014 తర్వాత దేశంలో స్కీములు మాత్రమే ప్రజలు చూస్తున్నారన్నారు. నరసాపురం లోక్ సభ స్థానంలో రెండు పర్యాయాలు బీజేపీ కైవసం చేసుకున్న చరిత్ర ఉందన్నారు. 2024 ఎన్నికల్లో దేశంలో బీజేపీ 350 ఎంపీ సీట్లు గెలవనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఆమె మాట్లాడుతూ… తలలేని మొండెంలా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో పేదలకు ఎన్ని ఇల్లు కట్టి ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

స్టిక్కర్ల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం మిగిలిపోతుందని ఆమె ఎద్దేవా చేశారు. బిల్లులు రాక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీని దూరం పెడుతున్నాయని ఆమె ఆరోపించారు. పొత్తుల విషయంపై మాట్లాడుతూ… ప్రస్తుతం జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని, పొత్తుల విషయాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని ఆమె స్పష్టంచేశారు. వైసిపి ప్రభుత్వం విధ్వంసక పాలన విద్వేషపూరిత పాలన కొనసాగిస్తొందని ఆమె ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమై ఆలయాలు సైతం ధ్వంసం చేస్తున్నారన్నారు. ఏపీలో ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని, సాధికార యాత్ర చేసే నైతిక హక్కు వైసీపీకి లేదని ఆమె ఆరోపించారు. ప్రజా కంఠక పాలనపై గళ మెత్తాల్సిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త తీసుకోవాలన్నారు.

రాజధానులు లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. తెలుగుదేశం, వైసిపి పార్టీలు కేంద్రం సహకరించలేదని చెబుతున్నాయని, డిపిఆర్ కు ముందే 2500 కోట్లు రాజధానికి కేంద్రం ఇచ్చిందని స్పష్టం చేశారు. నరసాపురం వశిష్ట వారధికి కేంద్రం 400 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. జాతీయ హోదా ఇచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణంలో టిడిపి హయాంలో మూడేళ్లు జాప్యం జరిగిందని, వైసీపీలో రివర్స్ ట్రెండింగ్ వల్ల పోలవరం దెబ్బతిందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రత్యేక హోదా కోసం పోరాడాలని అంటున్నారని, ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేశాక ప్యాకేజీకి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. టిడిపి, వైసిపి, కాంగ్రెస్ మూడు పార్టీలు బిజెపిపై నిందలు వేస్తున్నాయని ఆమె ఆరోపించారు.

పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం..
జిల్లా పార్టీ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ఫిబ్రవరి 20నుండి 29 వరకు ప్రజా పోరుయాత్ర నిర్వహిస్తామన్నారు ప్రతి కార్యకర్త చేతిలో బీజేపీ జెండా గుండెలో ఏపీ అభివృద్ధి అజెండా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్రం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. ఏపీలో బీజేపీ బలోపేతానికి పార్టీశ్రేణులు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసరాజు వర్మ మాట్లాడుతూ .. రాబోయే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా బీజేపీ అభ్యర్థి గెలుపొందడం ఖాయమన్నారు.

రాష్ట్రంలో అక్రమ వ్యాపారంపై ప్రశ్నిస్తే అధికార పార్టీ నేతలు పురందేశ్వరిపై తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ఒక మహిళపై మాట్లాడిన భాష సక్రమంగా లేదన్నారు. తమకు చేతకాక కాదని.. తన్ని తోలు తీస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల్ని మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కావాలా.. మోడీ ప్రభుత్వం కావాలా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. మీ చెల్లిని కూడా చూడలేని ముఖ్యమంత్రికి మహిళా సాధికారత కోసం మాట్లాడే హక్కు లేదని ఆయన ఎద్దేవా చేశారు. నరసాపురం పార్లమెంట్ లో బీజేపీ మూడుసార్లు పోటీ చేస్తే రెండుసార్లు ఎంపీగా గెలుచుకున్న చరిత్ర ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు నార్ని తాతాజీ, పార్టీ రాష్ట్ర నాయకులు పాకా సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్, దంతులూరు నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement