Sunday, November 24, 2024

Srisailam: శ్రీశైలంలో కన్నులపండువగా పుణ్యనదీ హారతి.. పుల‌కించిన భ‌క్తజనం

శ్రీ‌శైలం (ప్ర‌భ‌న్యూస్‌): జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో సోమవారం పుణ్య నది హారతి కార్యక్రమాన్ని దేవస్థానం అధికారులు నిర్వహించారు. సాయంత్రానికి పౌర్ణమిఘడియలు ఉండడం, రేపు మధ్యాహ్నం వరకే పౌర్ణమి ఘడియలు ఉంటున్న కారణంగా ఇవ్వాల (సోమ‌వారం) సాయంత్రం 5 గంటల నుండి పుణ్యనదీహారతి కార్యక్రమం చేప‌ట్టారు. కార్యక్రమములో నదీమతల్లికి సారె సమర్పించారు. అదేవిధంగా పాతాళగంగ వద్ద నెల‌కొల్పిన‌ కృష్ణవేణి నదీమతల్లి విగ్రహానికి పూజాదికాలు చేశారు.

ఈ హారతి కార్యక్రమానికి ముందు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని ప‌ఠించారు. త‌ర్వాత కార్య‌క్ర‌మాన్ని నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ చేశారు. ఆ త‌ర్వాత పాతాళగంగ వద్ద ఉన్న‌ కృష్ణవేణి నదీమాతల్లికి పూజాదికాలు నిర్వ‌హించారు. సంప్రదాయాన్ని అనుసరించి నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, పుష్పహారతి, నంది హారతి, సింహహారతి, నక్షత్రహారతి, విష్ణుహారతి, కుంభహారతులు ఇచ్చారు. క‌న్నుల‌పండువ‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మాన్ని భ‌క్తులు చూసి సంతోషం వ్య‌క్తం చేశారు.. హ‌ర‌హ‌ర మ‌హాదేవ శంభో శంక‌ర అనే నామం శ్రీ‌శైలంలో మారుమోగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement