ఆంధ్రప్రభ ప్రతినిధి, (తిరుపతి) : వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అనేక అత్యాచారాలు జరిగాయని అప్పుడు రాని వారు నేడు వస్తున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. వడమాలపేట మండలం ఏఎంపురంలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటంబాన్ని ఆదివారం ఆమె పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
చిన్నారిపై అఘాయిత్యం తనను కలిచివేసిందని మంత్రి చెప్పారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. సొంత ఇంటిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఘటన జరిగిన తరువాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మద్యం మత్తులో నిందితుడు దారుణానికి ఒడిగట్టాడడని అన్నారు.
కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వమని మంత్రి అనిత అన్నారు. వైసీపీ హయాంలో సీసీ కెమెరాలు నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గంజాయి, నకిలీ మద్యానికి యువత అలవాటుపడేలా వ్యవహరించారని ఆరోపించారు. క్రైం రికార్డు చూస్తే వైసీపీ ఐదేళ్లలో ఎన్నో ఘటనలు జరిగాయని ఆరోపించారు.
రాష్ట్రంలో గంజాయి సాగును అరికట్టి, గంజాయి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నార్కోటిక్ వింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, గంజాయిపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తున్నట్లు చెప్పారు. పులివెందులలో మహిళపై అత్యాచారం జరిగితే జగన్ ఎందుకు నిందితుడిని శిక్షించలేదని ప్రశ్నించారు.
వైసీసీ హయాంలో మద్యం ఏరులై పారిందని ఆ విషయం అప్పుడు రోజాకు తెలియలేదా అంటూ ప్రశ్నించారు. ఈ రోజు మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసులు, ఆర్డీఓ తిరుపతి రామ్మోహన్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.