Thursday, November 21, 2024

AP: విధ్వంసంతో ప్రజాతీర్పు మారదు… టీడీపీ నేత లోకేష్

ఇది వైసీపీ మూకల ఉన్మాద చర్యే
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఓడిపోతామనే ఈ దుశ్చర్యలు

(ఆంధ్రప్రభ, అమరావతి) : పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో జరిగిన ప్రజాగళం సభ జన సునామీని తలపించడంతో వైసీపీ మూకల ఉన్మాదం కట్టలు తెంచుకుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. పల్నాడు జిల్లా క్రోసూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో గెలవడం అసాధ్య‌మని తేలిపోవడంతో అర్ధరాత్రివేళ ఎవరూ లేని సమయంలో టీడీపీ కార్యాలయానికి నిప్పుపెట్టి రాక్షసానందం పొందారన్నారు.

దాడులు, విధ్వంసంతో ప్రజాతీర్పును మార్చలేరన్న విషయాన్ని జగన్, ఆయన సామంతరాజు శంకర్‌రావు గుర్తించాలన్నారు. త్వరలో వైసీపీని జనం బంగాళాఖాతంలో కలపబోతున్నారని, క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీ కేడర్ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని లోకేష్ హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని, తక్షణమే పోలీసులు స్పందించి క్రోసూరు ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement