Tuesday, November 26, 2024

‘చేయూత’ కోసం మహిళల అవస్థలు.. ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు

ఆధార్ అన్నింటికీ ఆధారం. పిల్లలకు అమ్మఒడి పథకం డబ్బులు రావాలన్న, పెద్దలకు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా.. ఆధార్ వివరాలు అడుగుతున్నారు. ఇందులో ఏ చిన్న మార్పు చేయాలన్నా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. కరోనా వేళ నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ కోసం బారులు తీరన మహిళలు ఇప్పుడు ఆధార్‌లో తప్పులు సరిదిద్దుకోవడానికే ఆ క్యూ లైన్లు కట్టారు. ఎక్కడ వెనుకబడిపోతామో అని నిద్రాహారాలు మానేసి క్యూ కడుతున్నారు.

ఏపీలో సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసింది. బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉంటేనే నగదు జమ అవుతోంది. అదేసమయంలో ఫోన్‌ నెంబర్‌ను కూడా ప్రమాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చేయూత పథకం కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పథకం కింద బీసీ వర్గానికి చెందిన మహిళలకు రూ.15వేల బ్యాంకులో జమ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ దరఖాస్తుతో పాటు ఆధార్‌ ని కూడా జతచేయాలన్న నిబంధన విధించింది. దీంతో మహిళలు ఆధార్‌ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. దీంతో పలు జిల్లాల్లో ఆధార్ కేంద్రాల వద్ద భారీగా రద్దీ నెలకొంది.

కృష్ణాజిల్లా నందిగామ కంచికచర్ల ఆధార్ సెంటర్లకు మహిళలు పోటెత్తారు. చేయూత పథకం కోసం ఆధార్ సెంటర్ కు మహిళు బారులు తీరారు. పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆధార్ నిర్వహకులు బెంబేలెత్తిపోతున్నారు. చేయూత పథకం కోసం ప్రభుత్వం ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ తప్పనిసరి చేయడంతో.. పథకం లబ్ధి పొందేందుకు మహిళలు వందల సంఖ్యలో ఆధార్ సెంటర్ కు వస్తున్నారు. రద్దీ ఎక్కువ కావడంతో ఆధార్ సెంటర్ నిర్వహకులు చేతులెత్తేశారు. అయితే, స్థానిక పోలీసుల సహాయంతో మూడు రోజులుగా ఆధార్ సెంటర్ నిర్వహణ సాగుతోంది. సర్వర్ సరిగా పనిచేయడం లేదని కరోనా నేపథ్యంలో మూసి వేస్తున్నామని నందిగామ ఆధార్ సెంటర్ నిర్వాహకులు బోర్డు తగిలించారు. అర్ధరాత్రి నుండి ఆధార్ సెంటర్ వద్ద పడిగాపులు కాసిన మహిళలు నిరాశగా వెనుదిరిగారు.

గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల్లో ఆధార్ కేంద్రాల వద్ద రద్ది నెలకొంది. చిన్న చిన్న మార్పుల కోసం క్యూ కట్టాల్సి వస్తోంది. తప్పులు సరిదిద్దుకోకుంటే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.. నిద్రాహారాలు మానేసి.. ఇంటి వద్ద పనులన్నీ అపేసి ఇలా వరుసల్లో వచ్చి నిల్చుంటున్నారు మహిళలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement