నెల్లూరు, (ప్రభ న్యూస్) : నెల్లూరు నగరంలో నూతనంగా పబ్ ఏర్పాటు చేశారని, నగర వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వాసులు కూడా పెద్ద ఎత్తున ఈ పబ్‌కు విచ్చేస్తున్నారని సోషల్ మీడియాలో గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో జిల్లా ఎస్పీ సీహెచ్.విజయరావు పోలీసు అధికారులను ఆదేశించడంతో స్థానిక పోలీసులు ఆ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. మహానగరాలకే పరిమతిమైన పాశ్చాత్యపోకడలు నెల్లూరు నగరంలోనూ విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. పబ్ కల్చర్ జిల్లాకు పాకింది. గతంలో నగరంలోని ఆర్టీసీీ బస్టాండు సమీపంలోని ఓ బార్‌లో పబ్ ఏర్పాటు చేశారు. అనుమతులు లేకపోవడంతో అది కొద్దిరోజులకే మరిమితమైంది. తాజాగా నెల్లూరు నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద పబ్ ఏర్పాటుచేశారన్న ప్రచారం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న నెల్లూరీయులు తమ స్నేహితులకు ఫోన్లు చేసి నెల్లూరులో పబ్ ఉందంటగా.? సంక్రాంతికి వస్తున్నాం రచ్చరచ్చ చేద్దాం అంటూ మాట్లాడుకుంటున్నారు. పబ్ విషయం నగరంలో ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ విషయంపై దృష్టి సారించిన పోలీసు అధికారులు అక్కడ ఏముంది అన్న విషయాలను తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించారు. బార్ అండ్ రెస్టారెంట్ మాత్రమే ఉందని అధికారులు గుర్తించారు. పబ్ విషయపై నిర్వాహకులను ఆరాతీయగా అలాంటిదేమీ లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. పైపెచ్చు రెస్టారెంట్‌లో సీసీ కెమెరాలున్నాయని వాటిని పరిశీలించుకోవచ్చని తెలిపినట్లు సమాచారం. అయితే ఇవ్వన్ని బాగానే ఉన్నా న్యూఇయర్ సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 31వ తేది రాత్రి సదరు పబ్‌లో రూ.800 ఎంట్రీ ఫీజుగా పెట్టి కాంప్లిమెంట్ కింద బీరు ఉచితంగా ఇవ్వడంతో పాటు నృత్యాలు చేసుకునే అవకాశం కల్పించారన్న ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో అసలు అక్కడ ఉండేది బార్ అండ్ రెస్టారెంటేనా.. లేక పబ్బా తేలాల్సి ఉంది. అనుమతులు లేకుండా నగరంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులుగాని , మరెవరైనా గాని పబ్ నిర్వహిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నగర ఇన్‌చార్జి డీఎస్పీ వై.హరనాధ్‌రెడ్డి హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital