రాష్ట్రాన్ని సైకో జగన్ సర్వనాశనం చేశాడని.. ఆయనను సీఎం పదవి నుంచి దించేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పలమనేరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఐదేళ్ల జగన్ పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేసిన ఘనతను జగన్ సొంతం చేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు. రైతులకు సాగునీరు అందించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని.. అడుగడుగునా నిలదీయాలన్నారు. జగన్ సిద్దం అంటూ యాత్ర చేపడుతున్నాడని.. మనం కూడా ఆయనను ఇంటికి పంపేందుకు సిద్దంగా ఉండాలన్నారు. అవినీతి సొమ్ముతో ఓట్లను కొనాలని వైసీపీ అనుకుంటోందన్నారు. జగన్ పాలనలో మైనార్టీల బతుకులు చిన్నాభిన్నమై పోయాయన్నారు.
ప్రాజెక్టులను వేటినీ ఈప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సబ్సిడీలు కూడా అందడం లేదన్న చంద్రబాబు రైతులను జగన్ నిట్టనిలువునా ముంచేశారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రాజెక్టులకు అధిక నిధులను కేటాయించడమే కాకుండా అనేక ప్రాజెక్టులను పూర్తిచేశామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది శాతం పనులను కూడా చేయలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను జగన్ తీసేశారన్నారు. పేదల బతుకుల్లో చీకటి నింపిన జగన్ ను అధికారం నుంచి దించితే తప్ప ఏపీ బాగుపడదని ఆయన అన్నారు. ఇప్పటికే ఏపీ సర్వనాశనమయి పోయిందని చంద్రబాబు అన్నారు.