Thursday, November 21, 2024

నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ -సీ54.. ప్రారంభమైన కౌంట్‌డౌన్‌

సూళ్లూరుపేట(శ్రీహరికోట), (ప్రభన్యూస్‌): గగన తలంలో మరో విజయాన్ని నమోదు చేసేందుకు ఇస్రో సర్వం సిద్దం చేసింది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి ఇవ్వాల (శనివారం) ఉదయం 11.56గంటలకు పీఎ స్‌ఎల్‌వీ -సీ54 రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాల్లో డాక్టర్‌ బీఎన్‌ సురేష్‌ అధ్యక్షతన మిషన్‌ సంసిద్దతా సమావేశం (ఎంఆర్‌ఆర్‌) నిర్వహించారు. అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశం నిర్వహించి ప్రయోగానికి సంసిద్దత వ్యక్తం చేశారు. దీంతో ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియను నిన్న (శుక్రవారం) ఉదయం 10.26గంటలకు ప్రారంభించారు.

25.30 గంటల పాటు నిర్విరామంగా కొనసాగనున్న కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఈ రోజు ఉదయం 11.56గంటలకు చేరుకున్న వెంటనే నారింజ రంగు నిప్పులు చిమ్మూతూ పీఎస్‌ఎల్‌వీ -సీ54 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. కౌంట్‌డౌన్‌ సాగుతున్న సమయంలోనే రాకెట్‌లోని నాలుగు దశలలో ఇంధనాన్ని నింపే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు.

ఈ క్రమంలో షార్‌కు చేరుకున్న ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా 1117 కిలోల బరువున్న ఓషన్‌ శాట్‌ -3తో పాటు ఇండియా, భూటాన్‌ దేశాలు సంయుక్తంగా రూపొందించిన 18.28 కిలోల అకా ఐఎన్‌ఎస్‌-2, భారత్‌కు చెందిన ధృవ స్పేస్‌ ఇండియా ప్రైవేట్‌ కంపెనీకి చెందిన 1.45 కిలోల బరువుగల రెండు తైబోల్త్‌ ఉపగ్రహాలు, పిక్సిల్‌ ఇండియా కంపెనీ చెందిన 16.51 కిలోల ఆనంద్‌, అమెరికాకు చెందిన 17.29 కిలోల బరువుగల ఆస్ట్రోకాస్ట్‌ -2 పేరుతో నాలుగు ఉపగ్రహాలను ఈ రాకెట్‌తో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

రాకెట్‌ గమనం ఇలా

నాలుగు దశలలో సాగనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ54 రాకెట్‌ ఒక్కో దశను దాటుకుంటూ ఆగ్రభాగన ఉన్న ఉగప్రహాలను నిర్ణీత కక్ష్యవైపు మోసుకెళ్లనుంది. నాలుగో దశలో ఉన్న ఉపగ్రహాలలో మొదటగా ఓషన్‌ శాట్‌-3 ఉపగ్రహాన్ని 17.20 నిమిషాలలో భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తమాన కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహాన్ని విడిచిన అనంతరం ఇంజన్‌ రెండు సార్లు ఆఫ్‌ఆన్‌ చేసి మిగిలిన ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టి ఉన్నారు.

షార్‌లో పటిష్ట భద్రతా చర్యలు

శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి షార్‌ చేపట్టనున్న పీఎస్‌ఎల్‌వీ -సీ54 ప్రయోగం నేపథ్యంలో భద్రతా చర్యలను పటిష్టం చేశారు. అడుగడుగునా సీఐఎస్‌ఎఫ్‌ బలగాలను మోహరించి ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా షార్‌కు వెళ్లే మార్గాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement