సూళ్లూరుపేట (శ్రీహరికోట) (ప్రభన్యూస్): అంతరిక్ష ప్రయోగాలతో మరోమారు సత్తా చాటేందుకు ఇస్రో రెడీ అయ్యింది. ఈ క్రమంలో పీఎస్ఎల్వీ -సీ52 రాకెట్ ప్రయోగానికి ఈరోజు ఉదయం 4.29గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించినట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. రేపు ఈ రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లనుంది. కాగా, కరోనా మహమ్మారి ప్రభావంతో షార్‌లో రాకెట్ ప్రయోగాలకు కొంత ఆటంకం కలిగినప్పటికీ వాటిని అధికమిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ -సీ52 రాకెట్ ప్రయోగానికి నాంది పలికారు. ఈ ప్రయోగం ద్వారా 1710 కిలోగ్రాముల బరువున్న ఈఎస్ఓ-04 ఉపగ్రహంతో పాటు ఇన్స్పైర్ శాట్-1, దీన్ని యూనివర్సిటీ ఆప్ కొలారాడోకు చెందిన లేబోరేటరీ ఆఫ్ అట్మాస్పియరిక్ అండ్ స్పెస్ ఫిజిక్స్‌తో కలిసి ఇండియా ఇన్స్ట్ట్యూట్ ఆప్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. రెండో చిన్న శాటిలైట్ ఐఎన్ఎస్-2టీడీ. ఇది ఇండియా – భూటాన్ జాయింట్ శాటిలైట్. వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్లు, నేలపై తేమ, హైడ్రాలజీ, వరదలు సంభవించే వాతావరణం వంటి అనువర్తనాలను అన్ని వాతావరణ పరిస్థతుల్లో అధిక నాణ్యత చిత్రాలను అందించే విధంగా ఈఎస్ఓ -04 ఉపగ్రహాన్ని తయారు చేశారు.
ఈ ఉపగ్రహాలను భూమికి 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్యసమకాలిక ధ్రువ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. మూడు ఉపగ్రహాలతో రాకెట్ ప్రయోగానికి సిద్దమవుతున్న ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం సతీష్‌థావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ -సీ52 ప్రయోగ రిహార్సల్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటికే ప్రయోగానికి సంబంధించిన రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసిన శాస్త్రవేత్తలు మొదటి ప్రయోగ వేదిక పైకి పీఎస్ల్వీ -సీ52ను చేర్చారు. నింగికెక్కుపెట్టిన బాణంలా ప్రయోగానికి సిద్దంగా ఉన్న పీఎస్ఎల్వీ -సీ52 రాకెట్‌కు సంబంధించిన రిహార్సల్‌ను శనివారం విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలు ఎంఆర్ఆర్ (మిషన్ రెడీనెస్ రివ్యూ) సమావేశం నిర్వహించారు. అనంతరం షార్ డైరెక్టర్ రాజ రాజన్ ఆర్ముగం ఆధ్వర్యంలో లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశాన్ని నిర్వహించి పీఎస్ఎల్వీ -సీ52 ప్రయోగానికి గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చారు. 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్‌ను కొనసాగించి సోమవారం ఉదయం 5.59గంటలకు పీఎస్ఎల్వీ -సీ52 రాకెట్ ప్రయోగం నిర్వహించనున్నారు. కౌంట్‌డౌన్ సమయంలోనే రాకెట్లో ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టానున్నారు. కౌంట్‌డౌన్ సోమవారం ఉదయం 5.59 గంటలకు చేరుకోగానే నింగుకెక్కుపెట్టిన బాణంలా ఉపగ్రహాలను మోసుకుంటూ నింగిలోకి పీఎస్ఎల్వీ -సీ52 దూసుకెళ్లనుంది.
షార్కు చేరుకున్న ఇస్రో చైర్మన్ సోమనాధ్
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి చేపట్టనున్న పీఎస్ఎల్వీ -సీ52 రాకెట్ ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ సోమనాధ్ షార్కు చేరుకున్నారు. ఇస్రో చైర్మన్‌గా సోమనాధ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో జరిగే మొదటి ప్రయోగం పీఎస్ఎల్వీ -సీ52. దీంతో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇస్రో చైర్మన్ శాస్త్రవేత్తలతో కలిసి కృషిచేస్తున్నారు. షార్కు చేరుకున్న వెంటనే శాస్త్రవేత్తలతో ప్రయోగంపై సమీక్షించారు.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ -సీ52 రాకెట్ ప్రయోగం చేపట్టనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. షార్కు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందుగానే అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రయోగ వీక్షణకు ఏర్పాట్లు
గతంలో రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకులను షార్ కేంద్రంలోకి అనుతించే వారు. అయితే కరోనా మహమ్మారి ప్రభావంతో షార్‌లోకి సందర్శకులను అనుమతించక పోవడంతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రయోగాన్ని వీక్షించే ఏర్పాట్లను ఇస్రో అధికారులు చర్యలు చేపట్టారు.