దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఎన్వీ రమణ తర్వాత మరో తెలుగు తేజం సుప్రీం పీఠాన్ని అధిష్టించనున్నారు. మూడు దశాబ్దాలకు పైగా సుప్రీం కోర్టులో సామాన్యుల సమస్యలపై వాదిస్తూ మచ్చలేని న్యాయవాదిగా పేరొందిన తెలుగు తేజం.. ప్రకాశం జిల్లా జె.పంగులురు మండలం అలవలపాడు గ్రామ మూలాలు ఉన్న పమిడిఘంటం నరసింహ(జస్టిస్ పీ.ఎస్. నరసింమ) మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ న్యాయవర్గాల్లో మేధావిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న జస్టిస్ P.S నరసింహ న్యాయవాద వృత్తి నుంచి నేరుగా న్యాయమూర్తి కానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయంతో సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రస్తుత సీనియారిటీ ప్రకారం 2027 అక్టోబర్ నుండి మే 2028 వరకు షుమారు 8 నెలల పాటు దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించే గొప్ప అత్యున్నత అవకాశం కూడా దక్కనుంది.
ఇప్పటివరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇద్దరు తెలుగువారు పనిచేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు చరిత్రలో నిలిచిపోయారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ రెండో తెలుగు వ్యక్తిగా చరిత్రపుటల్లోకెక్కారు. భవిష్యత్తులో ఈ అత్యున్నత పదవిని చేపట్టబోయే మరో తెలుగు వ్యక్తిగా పీఎస్ నరసింహ కానున్నారు. బార్ అసోసియేషన్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన ఆరో లాయర్‌గా పీఎస్ నరసింహ చరిత్ర సృష్టించారు
పీఎస్ నరసింహ తండ్రి స్వర్గీయ జస్టిస్ పమిడిఘంటం కోదండరామయ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయనకు న్యాయవర్గాల్లో మంచి పేరు ఉంది. కాగా ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి గ్రామంలో జన్మించిన పీఎస్ నరసింహ చదువంతా హైదరాబాద్‌లోనే సాగింది. బడీచౌడీలోని సెయింట్ ఆంథోనీ స్కూల్‌లో, నిజాం కళాశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేయడానికి ఢిల్లీ వచ్చిన ఆయన పట్టభద్రుడయ్యాక దేశరాజధానిలోనే ప్రాక్టీసు కొనసాగించారు.
1990 నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తున్న నరసింహ 2014-2018 మధ్య నాలుగేళ్లు అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఉన్నారు. అయోధ్యలో రామమందిరం అనుకూలంగా కేసు వాదించిన ప్యానెల్ లో ఆయన ముఖ్యుడు. అలాగే 15 సంవత్సరాలు లిటిగేషన్‌లో ఉన్న బీసీసీఐ(BCCI) కేసులో అమికస్ క్యూరీగా వ్యవహరించి 145 గంటల పాటు చర్చించి, అందర్నీ ఒప్పించి దాని పరిపాలనకు సంబంధించిన సమస్యలను సామరస్యంగా పరిష్కరించడం ఆయనకెంతో పేరు తెచ్చింది. ప్రస్తుతం క్రికెట్ ని శాసిస్తున్న BCCI ఇంత బలంగా ఉండడానికి కారణం ఆయనేనంటే అతిశయోక్తి కాదు.
సుప్రీం కోర్ట్ న్యాయవాదిగా PS నరసింహ అనేక పర్యావరణ, అటవీ చట్టాలకు సంబంధించి పలు కేసులు కూడా వాదించారు. పర్యావరణ, అటవీ బెంచ్‌కు అమికస్ క్యూరీగా 3 సంవత్సరాలు ఉన్నంతకాలం ముఖ్యమైన పర్యావరణ, అటవీ చట్టాలు, గిరిజన హక్కుల రూపకల్పనలో శ్రీనరసింహ ఎంతగానో తోడ్పడ్డారు. అలాగే.. తమిళనాడు సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు కేసులో కూడా అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన కీలక వాదనలు చేశారు.
కాగా అలవలపాడు గ్రామానికి చెందిన వీరి పూర్వీకులు శ్రీరామభక్తులు. P.S నరసింహా తాతగారికి అద్దంకి మండలం మోదేపల్లిలో కూడా కొంత భూమి ఉండడంతో ఆగ్రామంలో స్థిరపడ్డారు. జస్టిస్ నరసింహ తాతగారి సోదరులు శ్రీరామభక్త పమిడిఘంటం వెంకటరమణ దాసు భద్రాచలంలో అంబా అన్నదాన సత్రం (అలవలపాటి వారి సత్రం) ను నెలకొల్పి భద్రాచలం వచ్చే రాములవారి భక్తులకు విశిష్ట సేవలందించారు. ఇటీవల దేవస్థానంవారు దీనిని పునర్నిర్మించారు. ఈ సత్రానికి భక్తులు కొన్ని వందల ఎకరాల భూములు విరాళంగా ఇచ్చారు. ఇటీవల వరకు PS నరసింహ తండ్రి మాజీ హైకోర్ట్ జడ్జీ పమిడిఘంటం కోదండరామయ్య ఈ సత్రం ట్రస్టిగా సత్రం వ్యవహారాలు చూసేవారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రస్తుతం ఈ సత్రాన్ని శ్రీ భారత తీర్ధ మహాస్వామి వారి పీఠానికి అప్పగించారు.