రాష్ర్ట వ్యాప్తంగా విద్యుత్ కేంద్రాల వద్ద ధర్నాలు
పలు ప్రాంతాలలో రోడ్లపై బైఠాయించి నిరసనలు
అమరావతి : కరెంట్ ఛార్జీల పెంపుపై వైసీపీ పోరుబాటను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా, ప్రజలకు తోడుగా నిలుస్తూ ఆందోళన చేపట్టాలంటూ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు ష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తల నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రప్రజలపై రూ. 15 వేల కోట్ల అదనపు భారం మోపిందని ఆరోపించింది. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసనలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని, ఎన్నికలకు ముందు మాటలకు ఇప్పటి చేతలకు సంబంధం లేదని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో విద్యుత్ బిల్లులు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తే వారిపై కాల్పులు జరిపిన ఘనుడు చంద్రబాబు అన్ని ఆరోపించారు. నగరిలో మాజీ మంత్రి రోజా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు ష్యురిటీ.. బాదుడు గ్యారంటీ అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు. ఓటేసిన ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం కాటేస్తుందని ఆరోపించారు.
కాకినాడ విద్యుత్ డీఈ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసనలో కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక, తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, పిఠాపురంలో వంగా గీతా, పెద్దాపురంలో దవులూరి దొరబాబు, జగ్గంపేటలో తోట నరసింహం, విశాఖ సౌత్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. శింగనమల నియోజకవర్గంలో ఆలూరు సాంబశివారెడ్డి, ఉరవకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి , నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, పాణ్యంలో మాజీ ఎమ్మెల్యే, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.