Friday, November 22, 2024

రాజ్యాంగ రక్షణతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ.. చెన్నై రిటైర్డు జడ్జి జస్టిస్‌ చంద్రు

అమరావతి, ఆంధ్రప్రభ: రాజ్యాంగ రక్షణతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కే.చంద్రు అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులు రాజ్యాంగాన్ని సైతం విస్మరిస్తూ నియంతల్లా వ్యవహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. విజయవాడలో మూడు రోజుల పాటు నిర్వహించనున్ను స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్టీఎఫ్‌ఐ) ఎనిమిదో జాతీయ మహా సభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్‌ చంద్రు మాట్లాడుతూ దేశంలో సామ్యవాద ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూనే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత గురువులపై ఉందని చెప్పారు. విద్యావిధానం రూపకల్పన బాధ్యత పూర్తిగా రాష్ట్రాలకే అప్పచెప్పాలన్న కొఠారియా కమిషన్‌ సిఫారసులను పక్కనబెట్టి కేంద్రం సొంత అజెండాతో ఎన్‌ఈపీ-2020ని ప్రవేశపెట్టిందన్నారు.

ఆరేళ్ల నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత విద్య అంటూనే ప్రైవేటు విద్యను ప్రోత్సహించడం ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమని జస్టిస్‌ చంద్రు పేర్కొన్నారు. భావి భారత నిర్మాతలుగా ఉపాధ్యాయులు రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యుక్తులవ్వాలని చెపుతూ విద్యార్థుల్లో రాజ్యాంగ విలువలు పెంపొందించాలని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ పరిరక్షణ, టీచర్ల హక్కులు కాపాడటంలో న్యాయ వ్యవస్థ వైఫల్యాన్ని సోదాహరంగా వివరించారు. విద్య అనే ఆయుధం స్వార్థపరుల చేతుల్లోకి వెళ్లకుండా సక్రమ వినియోగ బాధ్యత ప్రతి టీచర్‌పై ఉందని చెప్పారు. దీనికి ఎస్టీఎఫ్‌ఐ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏఐఇఎఫ్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్‌ మాట్లాడుతూ దేశ, రాష్ట్ర రాజకీయాల్లో పాలనా అనిశ్చిత ఏర్పడిందని తెలిపారు.

ఇందుకు ఏపీకి రాజధాని లేకపోవడమే నిదర్శనమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి మత సంస్థల అండతో బీజేపీ మతం రంగు పులుముకొని పాలన చేస్తోందంటూ ఆయన విమర్శించారు. ఇప్పుడు దేశ ప్రజాస్వామ్యం, సామ్యవాదం ప్రమాదంలో పడిందని ఆయన హెచ్చరించారు. అధిక సంఖ్యలోని టీచర్ల ఐక్య పోరాటాలతోనే ప్రభుత్వ ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అడ్డుకోగలమని చెప్పారు. ఎస్టీఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు అభిజిత్‌ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన తొలి రోజు సమావేశాల్లో ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, ఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎన్‌ భారతి, సంయుక్త కార్యదర్శి హరికృష్ణన్‌, ఎం.సంయుక్త, ఎమ్మెల్సీ షేక్‌ సాల్జి తదితరులు ప్రసంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement