అతనో ప్రజా రక్షకుడు.. కానీ, ప్రజలకు రక్షణ కల్పించిల్సిన తనే దురుసుగా ప్రవర్తిస్తే.. పైగా ఓ మహిళా ప్రజాప్రతినిధిపై ఈ ఘటన జరిగితే.. అవును.. ఇలా జరిగింది నిజమేనంటున్నారు బాధితులు.. కానీ, తాను ఎవరినీ ఇబ్బందిపెట్టలేదు అంటున్నాడు ఆ పోలీసు ఆఫీసర్.. ఇంతకీ ఏమిటో అసలు విషయం చదివి తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా చీరాల టౌన్ కు చెందిన వైఎస్సార్ సీపీ మహిళా కౌన్సిలర్ ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆ మహిళకు చెందిన ఓ వీడియో ఇప్పుడు కలకలం సృష్టించింది. వ్యాపారాన్ని దెబ్బతీసి, బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ నుంచి తమను కాపాడాలని ఆ వీడియో ద్వారా ముఖ్యమంత్రి జగన్ కు ఆమె విన్నవించుకున్నారు.
చీరాల ఐదో వార్డు కౌన్సిలర్ సూరగాని లక్ష్మి, ఆమె భర్త నరసింహరావుకు పట్టణంలో బార్ అండ్ రెస్టారెంటు ఉంది. గత డిసెంబరు 31న రాత్రి 11.20 గంటలకు ఒకటో పట్టణ సీఐ రాజమోహన్ పోలీసు సిబ్బందితో సహా రెస్టారెంటులోకి వచ్చి.. ఆగమాగం చేశాడని, అంతేకాకుండా తన భర్తను బూతులు తిట్టాడని సీఎంకు కంప్లేంట్ చేశారు.. ఎంత ప్రాధేయపడినా వినకుండా దురుసుగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు.
తమ బార్ లోని సిబ్బందిని కొట్టడంతో పాటు తన భర్తను స్టేషన్‌కు తీసుకెళ్లి అసభ్య పదజాలంతో దూషించారని ఆమె ఆరోపించారు. దీనిపై జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్న అక్కసుతో ఈనెల 8న రాత్రి మరోసారి రెస్టారెంటుకు వచ్చి.. వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించి, అక్కడున్న వారిని తరిమికొట్టారన్నారు. కక్షతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్న సీఐ రాజమోహన్ నుంచి బారి నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని వీడియోలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే స్థానిక వైసీపీ నాయకులు వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు ఈ వీడియో మరింత అగ్గి రాజేసింది.
ఇదే విషయమై సీఐ రాజమోహన్‌ను వివరణ కోరగా.. నూతన సంవత్సరం రోజున బార్‌లోంచి కేకలు వినపడటం వల్ల తాను బయట ఉండి సిబ్బందిని లోపలకు పంపానని చెప్పారు. ఎవరిపైనా దాడి చేయలేదని, దూషించలేదని తెలిపారు. ఈ నెల 8న బార్‌లోకి వెళ్లలేదని.. కావాలనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.