అమరావతి, ఆంధ్రప్రభ : భూముల రిజిస్ట్రేషన్‌లో ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని అమలుల్లోకి తెచ్చింది. ఈ విధానం ద్వారా చాలా సులభంగా.. తక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌నే పూర్తి చేయాల్సి ఉంటుంది. మధ్యవర్తులతో సంబంధం లేకుండా.. కేవలం 20 నిమిషాల్లోనే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయొచ్చని అధికారులు చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ విధానాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. తాజాగా 2,526 గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతులను ప్రభుత్వం మంజూరు చేసింది.
రీ సర్వే పూర్తయి, ఎల్‌పీఎం (ల్యాండ్ పార్సిల్ నంబర్ ) వచ్చిన గ్రామాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు తెచ్చిన విషయం తెలిసిందే. గత నెల 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలవుతోంది. దీని కోసం రిజిస్ట్రేషన్ల శాఖలో ఉన్న కార్డు 1.0 స్థానంలో కార్డు 2.0ను తీసుకొచ్చారు. కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ విధానం సులువుగా ఉంటుందని.. కేవలం 20 నిమిషాల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ నూతన విధానం ద్వారా ప్రజలు ఎవరికి వారు నేరుగా ఆన్‌లైన్‌లో దస్తావేజులు తయారు చేసుకునేలా కొత్త విధానాన్ని రూపొందించారు. ఆలాగే ఆన్‌లైన్ స్లాట్‌బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక పై మధ్యవర్తులపై ఆధారపడకుండా ప్రజలు సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకునే పద్దతి అమలులోకి వచ్చింది. వినియోగదారులు తమ వివరాలను నేరుగా నమొదు చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఫీజు కూడా చెల్లించొచ్చు.
కొత్త వి ధానం ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తయిన 20 నిమిషాల్లో దస్తావేజులు కూడా చేతికి వస్తాయి. ఆ విధానం ఇప్పటికే అమలు జరుగుతోంది. అంతే కాదు ఈ విధానంలో ఆధార్ లింకుతో రిజిస్ట్రేషన్ సేవలను అనుసంధానం చేయడం ద్వారా అసలు వ్యక్తులు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు. ఆధార్ కార్డులో ఉన్న బయోమెట్రిక్ వివరాలతో సరిపోల్చుతారు. ఈకైవైసీ కూడా పూర్తి చేస్తారు.
ఈ విధానంలో రిజిస్ట్రే షన్ కోసం ముందుగా ఐజీఆర్ ఎస్-ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ కాగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి సైట్‌లోకి వెళ్లి..దరఖాస్తులో ఆస్తుల వివరాలు, సర్వే నెంబర్, లింక్ డాక్యుమెంటు నెంబర్, ఇతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ఆయా ఆస్తులకు సంబంధించి పూర్తి దస్తావేజులు స్కాన్ చేసి ఆప్ లోడ్ చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీ ల వివరాలు కూడా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
క్రయ విక్రయాలకు సంబంధించిన వారి ఫోటోలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే తీస్తారు. ఇదిలా ఉండగా గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా 51 గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రెండో దశలో 1500 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పుడు మళ్లీ 2,526 గ్రామ సచివాలయాల్లో ఈ సేవలు ప్రారంభించనున్నది. ఇందు కోసం సచివాలయాలను సబ్ డిస్ట్రిక్ట్‌లుగా నోటి ఫై చేసి, జాయింటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంలో వినియోగదారులు ఎలాంటి దస్తావేజులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.