గృహనిర్మాణ శాఖలో ప్రమోషన్లు, బదిలీల కోసం పైరవీలు జరుగుతున్నాయంటూ ‘ఆంధ్రప్రభ’లో ప్రచురితమైన కథనం ఆ శాఖతో పాటు సీఎంవోలోనూ చర్చకు దారి తీసింది. గృహనిర్మాణ సంస్థలో కింది స్థాయి నుంచి ఏఈ, ప్రాజెక్ట్ డైరెక్టర్గా వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తి, తిరిగి అదే సంస్థలో ఓఎస్డీగా నియమితులు కావడంపై సీఎంవో వర్గాలు ఆరా తీసినట్లు తెలిసింది. అలాగే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే క్రమంలో హౌసింగ్ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు 22 ఏళ్లుగా ఒకే పోస్టులో కొనసాగుతున్నఉద్యోగి ఎవరనే విషయంపై ఆరా తీశారు. అతడిని బదిలీ చేసేలా చర్యలు తీసు కోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
అలాగే ఇవ్వాల ఓటీఎస్, గృహనిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో పరిపాలనా విభాగంలోని ముఖ్య అధికారి, మేనేజర్ స్థాయి అధికారుల వ్యవహారంపై వివరాలు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఏసీబీ లేఖలో ఉన్న అధికారులపై ఉన్న ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఆంధ్రప్రభ’లో ప్రచురితమైన కథనం ద్వారా పదోన్నతులు, బదిలీల కోసం ముడుపులు చెల్లించుకుని, ఆ పనులు కాక నష్టపోయిన ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..