రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేస్తున్న కుమార్ విశ్వజిత్, సీఐడి చీఫ్‌గా పని చేస్తున్న రవిశంకర్ అయ్యన్నార్‌లకు అదనపు డీజీ నుంచి డైరక్టర్ జనరల్ హోదా ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఈ ఇద్దరు అధికారులు ప్రస్తుతం ఉన్న స్ధానాల్లోనే డీజీ హోదాలో కొనసాగేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కుమార్ విశ్వజిత్, రవిశంకర్ అయ్యన్నార్ పలు హోదాలో వివిధ పోస్టుల్లో సుదీర్ఘకాలం పాటు పోలీసుశాఖలో సేవలందిస్తూ వస్తున్నారు.
ఇద్దరు సీనియర్ ఐఏఎస్‌లకు పదోన్నతి
రాష్ట్రంలో ఇద్దరు మహిళా సీనియర్ ఐఏఎస్‌లకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలన విభాగం కమిషనర్‌గా పనిచేస్తున్న 1995 బ్యాచ్‌కు చెందిన జీ జయలక్ష్మికి సీసీఎల్‌ఏ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది.
మరో అధికారి ఏ వాణీ ప్రసాద్ ప్రస్తుతం లేబర్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (కార్మికశాఖ) ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.. తాజాగా ముఖ్య కార్యదర్శి స్థానే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కే విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.