అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతులు పండించిన చిరుధాన్యాలు (రాగులు, జొన్నలు) ఉత్పత్తులను మద్దతు ధరకు సేకరించి, తిరిగి వాటిని పీడీఎస్‌లోకి తీసుకొచ్చి లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తోంది. తాజాగా కొర్రలను సైతం కొనుగోలు చేసి పీడీఎస్‌లో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది.
ఈ సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 750 కొనుగోలు కేంద్రాల్లో సుమారు 60వేల టన్నులకు పైగా చిరుధాన్యాల సేకరణకు సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలోని రైతులను చిరుధాన్యాల సాగువైపు నడిపించేలా సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పండించే చిరుధాన్యాలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. గత రబీ సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల సేకరణకు శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలోనే కొర్రలకు కూడా మద్దతు ధర ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తోంది. కానీ, సీఎం జగన్ విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఖరీఫ్ సన్నద్ధతపై జాతీయ స్థాయి పౌరసరఫరాల శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో రాగులకు ఇచ్చే మద్దతు ధర క్వింటా రూ.3,846కే కొర్రలు కూడా కొనుగోలు చేసుకునేందుకు అనుమతిచ్చింది.
ఇక జొన్నలను క్వింటా మద్దతు ధర రూ.3,225గా నిర్ణయించింది. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నల పంపిణీ ప్రారంభించింది. తాజాగా కొర్రలు కూడా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీలో పీడీఎస్ వినియోగానికి ఏడాదికి రూ.1.80 లక్షల టన్నుల చిరుధాన్యాలను సేకరించాల్సి ఉంది. వీటిలో రాగులు అత్యధికంగా ఏడాదికి 89,760 టన్నుల అవసరం కాగా, మిగిలినవి జొన్నలు, కొర్రలు పంపిణీ చేస్తారు.
ఏపీలో రాగులు, జొన్నలు, కొర్రలు పంటల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఖరీఫ్‌లో రైతుల నుంచి సుమారు 60వేల టన్నుల వరకు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 1.20లక్షల టన్నులను ఎఫ్‌సీఐ నుంచి సేకరించనున్నారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి కొర్రలు, అక్టోబర్ చివరి వారం నుంచి రాగులు, జొన్నలు సేకరించనున్నారు. చిరుధాన్యాల పంపిణీని తొలి దశలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పౌర సరఫరాల శాఖ ప్రారంభించింది.
కార్డుదారుల ఇష్ట్రపకారం ఉచితంగానే బియ్యం బదులు రెండు కిలోల రాగులు, జొన్నలు అందిస్తోంది. రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలోనే ఈ పంటలు సాగవుతున్నాయి. ఫలితంగా తక్కువ ఉత్పత్తులు వస్తున్నాయి. అందుకే వెనుకబడిన జిల్లాలను ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్నారు. ధాన్యం సేకరణ మాదిరిగానే చిరుధాన్యాలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. వ్యవసాయ క్షేత్రం నుంచి గోడౌన్లకు తరలించే వరకు స్వయంగా ప్రక్రియను చేపడుతోంది. రైతే స్వయంగా తరలిస్తే మద్దతు ధరతోపాటు- గోనె సంచులు, హమాలీ, రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తోంది.