Monday, November 25, 2024

AP: రాయ‌ల‌సీమ‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి… టీజీ వెంక‌టేష్‌

క‌ర్నూలు : వెనుకబడిన రాయలసీమకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు రాయలసీమ హక్కుల వేదిక అధ్యక్షులు టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమ హక్కుల కోసం 24 ఏళ్లు అనేక పోరాటాలు చేసామన్నారు. వీటిలో కొన్ని డిమాండ్లు నెరవేరినప్పటికీ, మరికొన్ని పూర్తి కాలేదన్నారు. గత దశాబ్ద కాలంలో అధికారం చేపట్టిన ప్రభుత్వాలు రాయలసీమ అభివృద్ధి కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. వీటిలో ప్రధానంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న విషయాన్ని టీజీవి గుర్తు చేశారు. అధికారంలో ఎవరున్నప్పటికీ రాయలసీమ అభివృద్ధికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

శుక్రవారం కర్నూల్ లోని పరిణయ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ అసమర్థ పాలనతో ఇప్పటికే ప్రజలు విసుగెత్తారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌కి తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమ హక్కుల సాధనే లక్ష్యంగా రాయలసీమ హక్కుల ఐక్యవేదికను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. రాయలసీమలో సమ్మర్, వింటర్ క్యాపిటల్, మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని గతంలో డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచామన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన జ‌గ‌న్ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. కానీ ఇప్పటికీ ముందడుగు పడలేదన్నారు.

- Advertisement -

చంద్రబాబు అధికారంలోకి వస్తారు.. ఆయన అధికారంలోకి రాకముందే రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముందుగానే డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌ ఇచ్చింది.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌వోసి ఇవ్వలేదన్నారు. కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలన్నారు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో సమన్వయం కుదుర్చుకొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. గుండ్రేవులతో పాటు ఆర్డీఎస్, వేదవతి ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, రిజర్వాయర్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్‌లు నిర్మాణాలు చేయాలన్నారు. లేకపోతే రాయలసీమలో మళ్లీ ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని టీజీవి హెచ్చరించారు. సిద్దేశ్వరం ప్రాజెక్టును కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. జగన్ హయాంలో కాలువల ద్వారా చెరువులు నింపలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీటిని రాయలసీమ జిల్లాలకు అందజేయాలని కోరారు. చంద్రబాబు సీఎం అయ్యాక హంద్రీనీవా కాలువ వెడల్పు పనులతో పాటు గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరుకుంటున్నట్లు టీజీ వెంక‌టేష్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement