Saturday, November 23, 2024

AP | వాహన అమ్మకాల్లో మిశ్రమ పురోగతి… భారీగా పెరిగిన రవాణేతర వాహనాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో వాహన కొనుగోళ్లు జోరందుకున్నాయి. జీవిత పన్ను, ఇతర పన్నుల పెంపుతో ఏడాది తొలి మూడు నెలలు ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగలేదు. కొత్త వార్షిక సంవత్సరం మొదలైన తర్వాత రవాణేతర వాహనాల కొనుగోళ్లు పెరగగా.. జీవిత పన్ను, డీజిల్‌ రేట్లు, టోల్‌ బాదుడు వంటి కారణాలతో రవాణా వాహనాల కొనుగోళ్లు మందగించాయి. ఎన్నికల ఏడాది కావడంతో ఇంధన ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో రవాణా వాహనాల కొనుగోళ్లు కూడా పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

గత ఏడాది చివరి రెండు త్రైమాసికాల్లో రకరకాల రకరకాల కారణాలతో వాహనాల కొనుగోళ్లు తగ్గాయి. వాహన కొనుగోళ్లు తగ్గడంతో ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరలేదు. ఇటీవల రోడ్ల అభివృద్ధి, ఇతర కారణాలతో తిరిగి వాహనాల కొనుగోళ్లు పెరిగినట్లు అధికారులు చెపుతున్నారు. గత ఏడాదితో పోల్చితే రవాణేతర వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ద్విచక్ర వాహనాలు, కార్ల సంఖ్య అమ్మకాల్లో పురోగతి సాధించింది. గత ఏడాది ఆర్థిక సంవత్సరం మొదలైన తొలి నాలుగు నెలల్లో లక్షా 85వేల 119 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి.

ఈ ఏడాది ఇదే మొదటి నాలుగు నెలల్లో 7.65శాతం పెరుగుదలతో లక్షా 99వేల 274 వాహనాలు రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు అధికారులు చెపుతున్నారు. సొంతంగా వినియోగించే కార్లు గత ఏడాది 35,638 రిజిస్ట్రేషన్లు జరగగా, ఈ ఏడాది 37,158 రిజిస్ట్రేషన్లు జరిగాయి. నాలుగు చక్రాల వాహనాల అమ్మకాల్లో ఇది గతేడాదితో పోల్చితే 4.27శాతం పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో ద్విచక్ర వాహనాల అమ్మకాల శాతం 4.29, కార్ల అమ్మకాల శాతం 4.16శాతంగా పెరుగుదల నమోదైంది.

- Advertisement -

తగ్గిన రవాణా వాహణాల కొనుగోళ్లు..

రాష్ట్రవ్యాప్తంగా రవాణా వాహనాల కొనుగోళ్లు మందగించినట్లు గణాంకాలు చెపుతున్నాయి. గూడ్సు, ప్రయాణికుల వాహనాల కొనుగోళ్లు మైనస్‌ గ్రోత్‌ నమోదు కాగా ఆటోల కొనుగోళ్లు మాత్రం భారీగా పెరిగింది. గత ఏడాది 11,278 గూడ్సు వాహనాల అమ్మకం జరగ్గా, ఈ ఏడాది 20,13శాతం తగ్గి తొమ్మిది వేల ఎనిమిది రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. గూడ్సు వాహనాలతో పోల్చితే ప్రయాణికుల వాహనాల కొనుగోళ్లు భారీగా తగ్గాయి.

గత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఐదు వేల 461 ప్రయాణికుల వాహనాల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది 57.99శాతం తరుగుదలతో 2,294 అమ్మకాలు నమోదయ్యాయి. ఇందుకు రోడ్డు సెస్‌, త్రైమాసిక పన్నుల్లో పెరుగుదల, డీజిల్‌ రేట్లు వంటి పలు కారణాలు ఉన్నాయి. ఆటోల కొనుగోళ్లలో భారీ పెరుగుదల నమోదైంది. ప్రయాణ అవసరాలు పెరగడం, ప్రభుత్వ తోడ్పాటు వంటి కారణాలతో ఆటోల అమ్మకాల్లో పెరుగుదల నమోదైనట్లు చెపుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో, క్యాబ్‌ యజమానులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది.

ఇదే క్రమంలో ప్రయాణ అవసరాలు కూడా గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న ట్రాఫిక్‌, ఇతర కారణాలతో పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆటోల పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆటోల విక్రయాలు పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 106 ఆటోలు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఇదే ఈ ఏడాదికి వస్తే 795.28శాతం పెరుగుదలతో 949 ఆటోలు అమ్మకం జరిగినట్లు అధికారిక గణాంకాలు చెపుతున్నాయి.

అమ్మకాలు పెరిగే అవకాశం..

రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పటికే ఎల్పీజీ సిలెండర్లపై రూ.200 తగ్గించారు. ఇదే క్రమంలో డీజిల్‌, పెట్రోల్‌ రేట్లు కూడా తగ్గంచనున్నారు. మరో వైపు టోల్‌ బాదుడు కూడా తగ్గే అవకాశం ఉంది. టోల్‌ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రయాణించిన దూరానికే టోల్‌ రుసుము వసూలు చేసేలా చర్యలు చేపడుతున్నారు.

ఇదే జరిగిన పక్షంలో రవాణా వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రహదార్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. అనేక రోడ్లను పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధి చేశారు. ఇది కూడా వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహిస్తుందని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement