Monday, November 18, 2024

ఎపిలో అక్రిడేష‌న్ జ‌ర్న‌లిస్ట్ ల‌కు వృత్తి ప‌న్ను…క‌ట్ట‌కుంటే క‌ఠిన చ‌ర్య‌లు..

అమ‌రావ‌తి – ఏపీలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న రిపోర్టర్లకు వృత్తిపన్ను కట్టాలంటూ అధికారుల నుంచి నోటీసులు అందడం ఇప్పుడు వివాదంగా మారింది. పాత బకాయిలు సహా రూ.12500 వృత్తిపన్ను చెల్లించాలని ఆ నోటీసుల్లో ఉంది. వృత్తిపన్ను చెల్లించాలని అమలాపురంలో వివిధ పత్రికలు టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న 28 మంది విలేకర్లకు జనవరి 17న నోటీసులు అందాయి. అమలాపురంలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ సర్కిల్ కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయి. 2018-19 నుంచి 2022-23 వరకు సంవత్సరానికి రూ.2500 చొప్పున మొత్తం రూ.12500 చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా చెల్లించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

దీంతో నోటీసులు అందుకున్న విలేకర్లు వాణిజ్యపన్నుల అధికారి సుబ్బారావును కలిశారు. నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ప్రభుత్వ అక్రెడిటేషన్ కార్డులు ఉన్న రిపోర్టర్ల నుంచి వృత్తిపన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని అందుకే నోటీసులు జారీ చేశామని సమాధానం చెప్పారు. కాగా గతంలో రాజంపేటలోనూ ఇదే విధంగా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అప్పుడు రిపోర్టర్లు ఆందోళనలు చేయడంతో నోటీసులు వెనక్కి తీసుకుంది. మళ్లీ కోనసీమలో ఈ వ్యవహారం తెరపైకి రావడంతో ఏపీలోని వివిధ పత్రికలు ఛానళ్లలో పనిచేస్తున్న రిపోర్టర్లు ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నారు. వృత్తి ప‌న్ను చెల్లించాల‌ని కోరుతూ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను వెంట‌నే ఉప‌సంహ‌రించాల‌ని ప్ర‌భుత్వానికి జ‌ర్న‌లిస్ట్ సంఘాలు విజ్ఞ‌ప్తి చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement