పోలవరం నిర్వాసితుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, వారి దీక్షలు విరమింపజేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
‘‘ముఖ్యమంత్రి గారూ! పోలవరం నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ తో నాలుగు వారాలుగా దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలు మీ దృష్టికి వచ్చాయో లేదో తెలియదు. మీ ఎమ్మెల్యే, కొందరు అధికారులు వచ్చి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారట. మీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదంటే నిర్వాసితుల కష్టాలుకానీ, వారి దీక్షలు కానీ మీ వరకూ రాలేదని స్పష్టమవుతోంది. నిర్వాసితులైన గిరిజనులు, ఇతరులు పడుతున్న ఇబ్బందులపై మీరు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన పశ్చిమగోదావరి జిల్లాలోని నాలుగు మండలాలకు చెందిన 19 గ్రామాల నుంచి 1500 మందిని ఆరు నెలల క్రితం వరద ముప్పు ఉందని అధికారులు తరలించారు. అప్పటి నుంచీ వారు ఏమయ్యారనే విషయాన్ని పట్టించుకోకపోవడంతో నానా అగచాట్లు పడుతున్నారు. సొంత ఊరు, ఇళ్లు విడిచి కట్టుబట్టలతో వచ్చిన నిర్వాసితులకు ఉండడానికి గూడు చూపించలేదు. తాగునీటి సౌకర్యం కల్పించలేదు. అద్దెకు ఇళ్లు తీసుకుని, అద్దెలు కట్టలేక నానా బాధలు పడుతున్నా సర్కారు స్పందించదు. అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. కడుపుమండిన బాధితులంతా కలిసి ఉద్యమబాట పట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పోలవరం ఏటిగట్టు సెంటర్‌లో రిలేదీక్షలు ఆరంభించారు. రోజూ ఒక్కో గ్రామం నుంచి 30 మంది వరకూ నిర్వాసితులు వచ్చి దీక్షలో కూర్చుంటున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందనలేదు. కూలికెళితేనే కూడు దొరికే బతుకులైన నిర్వాసితులు దీక్ష చేయాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న ఊరి నుంచి తరలించారు, పునరావాస కాలనీలు పూర్తి చేయలేదు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఒక్కరికీ ఇవ్వలేదు. ఊరికాని ఊరిలో అద్దెకొంపల్లో అనాథల్లా నిర్వాసితులు కాలం గడుపుతున్నారు. తరలించి ఆరు నెలలైనా, దీక్షలు చేపట్టి నాలుగు వారాలైనా ఒకే ఒక్కసారి వైసీపీ ఎమ్మెల్యే, తహశీల్దార్ వచ్చి వెళ్లారంటే నిర్వాసితులని ఎంత చిన్నచూపు చూస్తున్నారో అర్థం అవుతోంది. ఐక్యవేదిక నుంచి ఓ 10 మందితో కూడిన బృందాన్ని సీఎం వద్దకు తీసుకెళ్తామన్న ఎమ్మెల్యే మళ్లీ పత్తాలేరు. పోలవరం ప్రాజెక్టుపైనా, నిర్వాసితులపైనా ఎందుకింత నిర్లక్ష్యం చూపుతున్నారో అర్థంకావడంలేదు. ఇప్పటికైనా మీరు స్పందించి 1500 నిర్వాసిత కుటుంబాల సమస్యలు యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
పరిష్కరించాల్సిన నిర్వాసితుల సమస్యలు ఇవీ :
అందరికీ చట్టప్రకారం పునరావాసం కల్పించాలి.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందరికీ ఇవ్వాలి.
సీఎం గతంలో ప్రకటించి 10 లక్షల ప్యాకేజీ అందించాలి.
2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి.
18 సంవత్సరాలు నిండిన వారందరికీ ప్యాకేజీ వర్తింపజేయాలి.
నిర్వాసితులకు కేటాయించిన కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి.
గ్రామాలను ఖాళీ చేయించిన తేదీనే కటాఫ్ తేదీగా పరిగణించాలి.
పైన పేర్కొన్న నిర్వాసితులకు సంబంధించిన ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించేందుకు మీరు చొరవ చూపాలి. ప్రతిపక్షనేతగా వున్నప్పుడు నిర్వాసితులకు మీరిచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి అయిన మీపైనే ఉంది.
నవ్యాంధ్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం తమ సర్వస్వం ధారపోసిన నిర్వాసితులకు చట్టప్రకారం కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం చట్టాల్ని ఉల్లంఘించడమే అవుతుంది. మానవతా దృక్పథంతో వ్యవహరించి నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరించి, వారితో దీక్షలు విరమింపజేస్తారని కోరుతున్నాను.’’ అని నారా లోకేష్ సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital