అమరావతి, ఆంధ్రప్రభ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది జూన్‌లో సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటిస్తామని జూలై నుంచి పెంచిన జీతాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, సర్వే ఉద్యోగుల సంఘం, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొబేషన్ డిక్లరేషన్, పీఆర్‌సీ ప్రకారం వేతనాల చెల్లింపు కోసం నిరీక్షిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గవ ర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు భీమిరెడ్డి అంజనరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ బీఆర్ కిషోర్, కార్యనిర్వాహక అధ్యక్షులు విప్పర్తి నిఖిల్ కృష్ణా భార్గవ సుతేజ్ తదితరులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ స్పందిస్తూ రెండు నెలల్లో సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మను ఆదేశించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిని కలిశారు. మహిళా పోలీసుల ప్రొబేషన్ డిక్లరేషన్, ఇతర అంశాలపై చర్చించారు. యాడ్‌వర్స్, యాంటెసిడెంట్ కేసుల విషయం పరిశీలన అనంతరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాగా రెవెన్యూశాఖలో సర్వే విభాగం ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విధంగా డిపార్టుమెంట్‌ను పునర్వ్యవస్థీకరించి 410 పోస్టులు అప్‌గ్రేడ్ పదోన్నతులకు అవకాశం కల్పించటం పట్ల వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి చారి, వెంకటరమణారెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అంజన్ రెడ్డి, అంకమరావు, భార్గవ్, కిశోర్ తదితరులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.