పెట్టుబడులు కొనసాగుతాయి
పోలవరం ప్రాజెక్టులో డిజైన్ లోపం ఉంది
ఏపీలో కేంద్ర పథకాలు అమలు కాలేదు
అమరాతిని రాజధాని సిటీగా డెవలప్ చేస్తాం
అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడులు ఆగవు అని బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంచార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీలో కేంద్ర సంక్షేమ పథకాలు అమలు దాదాపు జరగలేదన్నారు. అమరావతి ఐదు సంవత్సరాలలో రాజధాని కాలేదు.. కానీ, రాబోయే ఐదేళ్లలో అమరావతి రాజధాని అవుతుంది.. పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందనే నమ్మకాన్ని సిద్ధార్థ వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు.. విశాఖ స్టీల్ ప్లాంటులో పెట్టుబడులు ఆగవని మరోసారి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పునాదులలో లోపాలు జరిగాయని, పోలవరం డిజైన్ మార్పులు చేశారని వెల్లడించారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నచోటే అభివృద్ధి..
ఇక, అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్ధుల విషయంలో ఎలాంటి మార్పులు లేవని సిద్ధార్థ నాథ్ సింగ్ అన్నారు. ఉగాది భారతదేశానికి, తెలుగు వారికి చాలా ముఖ్యమైన రోజు అని, ఈ పండుగ ఏపీలో జరుపుకోవడం అద్భుతంగా ఉందన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న చోట సంక్షేమం అమలు చేయడం సాధ్యపడిందని, ఆంధ్రప్రదేశ్ మాత్రం కేంద్ర సంక్షేమ పథకాలు అమలు దాదాపు జరగలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపుకోసం అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.