నందికొట్కూరు, (ప్రభ న్యూస్): ఏపీలో టెన్త్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ల లీకేజీ ఇష్యూ చాలా సీరియస్ అవుతోంది. ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ స్పీడప్ చేశారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచుకునేందుకు ఈ వ్యవహారం నడిపినట్టు కనిపెట్టారు. నందికొట్కూరు పట్టణంలో ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం చేసిన తప్పిదం వల్ల పరీక్ష పేపర్ బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు పట్టుబడ్డారు. ఈ విషయంపై జిల్లా ఎస్ పి, కలెక్టర్ , డీ ఈఓ స్పందించి నందికొట్కూరు చేరుకుని విచారణ చేపట్టారు. పట్టణంలోని శ్రీ నవనంది పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు, మరో నలుగురు బయటి వ్యక్తులు నిందితులుగా తేల్చారు.
పాఠశాలలో పని చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక పీఈటీ కలిసి పేపర్ బయటకు రాగానే నవనంది పాఠశాలకు తీసుకెళ్లడం, పరీక్ష పత్రానికి సమాధానాలను వెతికి జిరాక్స్ సెంటర్ కు పంపడం ఇక్కడ సంచలనంగా మారింది. జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు అమీర్ బాషాను కూడా అదుపులోకి తీసుకొని విచారించగా దీనికి కారకులైన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. ఆత్మకూరు డీఎస్పీ నిందితులను అదుపులోకి తీసుకొని మీడియాకు వివరాలు వెల్లడించారు.