Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP | బలహీన వర్గాలకు టీడీపీలోనే ప్రాధాన్యం.. మంత్రి కొలుసు

AP | బలహీన వర్గాలకు టీడీపీలోనే ప్రాధాన్యం.. మంత్రి కొలుసు

0
AP | బలహీన వర్గాలకు టీడీపీలోనే ప్రాధాన్యం.. మంత్రి కొలుసు

అమరావతి: బలహీన వర్గాల వారికి చట్టసభల్లో సముచితమైన స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రెండు స్థానాలు బలహీనవర్గాల వారికి కేటాయించి రాజకీయంగా సముచిత స్థానం కల్పించిందని రాష్ట్ర గృహ నిర్మాణ అండ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళవారం కూటమి సభ్యుల నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాల వారికి రాజకీయంగా గుర్తింపు తీసుకురావడమే గాక దేశంలో ఎక్కడా లేనివిధంగా పార్టీ అధ్యక్ష పదవిని ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు.

గతంలో బలహీనవర్గాలని బ్యాక్ బోన్ గా ప్రచారం చేసుకున్న పార్టీలు వారికి చట్టసభల్లో కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, బలహీనవర్గాల వారిని వాడుకోవడానికి గత ప్రభుత్వాలు చేశాయని మంత్రి విమర్శించారు. ఒక రాజకీయ పార్టీకి జీవితకాలం అధ్యక్షుడిగా ఉండాలని గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో తీర్మానం చేయించుకున్నారని, ఆ తీర్మానాన్ని ఎన్నికల సంఘం అనుమతించలేదని, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం బలహీన వర్గాల వారికి అధిక ప్రాధాన్యమిస్తూ పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని మంత్రి వివరించారు.

గత ప్రభుత్వంలో కేబినెట్ లో ఉన్న మంత్రులు ఏ విధమైన చర్చల్లో పాల్గొనేవారు కాదని, కానీ ప్రస్తుతం ప్రభుత్వంలో బలహీన వర్గాలకు చెందిన మంత్రులు కేబినెట్ సమావేశాల్లో ఏ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా దాని గురించి వివరంగా చర్చిస్తున్నారని మంత్రి పార్ధసారధి తెలిపారు. ప్రజాస్వామ్య బద్దంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో సముచిత న్యాయం పాటించారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏర్పడిన పరిస్థితుల వల్ల గతంలో రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పారశ్రామిక వేత్తలు తిరిగి రాష్ట్రానికి వస్తున్నారని మంత్రి పార్ధసారధి వివరించారు.

Exit mobile version