(ఆంధ్రప్రభ-ఎన్టీఆర్ బ్యూరో) : ఏపీలో దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అన్ని దేవాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని శనివారం ఆయన దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయ ఇన్చార్జిఓ రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు.
కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రికి వేద పండితులు వ్యాధి ఆశీర్వచనం చేయగా ఆలయ ఇన్చార్జ్ ఈవో రామచంద్ర మోహన్ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన దేవస్థానం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించారు.
దేవాలయంలో రోజు జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్న అభివృద్ధి పనులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. భక్తులకు మరుగైన సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరీ ముఖ్యంగా క్యూలైన్లో ఉన్న భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకుని, వారు అడుగుతున్న సందేహాలకు వినయ పూర్వకంగా సమాధానం ఇచ్చి సజావుగా దర్శనమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.