కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీ తొలి పర్యటన
భారీగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
విశాఖ ఆంధ్ర వర్శిటీ గ్రౌండ్ లో బహిరంగ సభ
హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
విశాఖపట్నం. ఆంధ్ర ప్రభ బ్యూరో – ఎపిలో బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీ ఎపిలో పర్యటించనున్నారు.. విశాఖ వేదికగా రేపు జరిగే కార్యక్రమాలలో ఆయన ప్రధాని హోదాలో పాల్గొననున్నారు. ప్రధానమంత్రి రెండు రోజుల పర్యటనలో భాగంగా జనవరి 8, 9 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో పర్యటించనున్నారు. సుస్థిరాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం.. దాదాపు రూ. 2 లక్షల కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. ఈ నెల 8న సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 9న ఉదయం 10 గంటలకు భువనేశ్వర్ లో ప్రవాసీ భారతీయ దివస్ (పీబీడీ)ను కూడా ఆయన ప్రారంభిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి
విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద అత్యాధునిక ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. హరిత ఇంధనం, సుస్థిర భవిష్యత్తు దిశగా అంకితభావంతో ఆయన వేసిన మరో ముందడుగిది. జాతీయ గ్రీన్ హడ్రోజన్ మిషన్ లో భాగంగా ఇదే తొలి గ్రీన్ హైడ్రోజన్ హబ్. ఈ ప్రాజెక్టు పెట్టుబడి దాదాపు రూ. 1,85,000 కోట్లు. 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాల్లో పెట్టుబడి ఇందులో భాగం. తద్వారా, రోజుకు 1500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఇది దేశంలోని అతిపెద్ద సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా మారింది. దానితోపాటు హరిత మిథనాల్, హరిత యూరియా, పర్యావరణ హిత వైమానిక ఇంధనం సహా రోజుకు 7500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులను అందించగల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు ప్రధానంగా ఎగుమతి మార్కెట్ ను లక్ష్యంగా పని చేస్తుంది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యం దిశగా భారత్ కు ఈ ప్రాజెక్టు విశేషంగా సహాయపడుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో రూ. 19,500 కోట్ల విలువైన వివిధ రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా పలు ఇతర ప్రాజెక్టులతోపాటు విశాఖపట్నంలో దక్షిణ తీర రైల్వే ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులు రద్దీని తగ్గించి, అనుసంధానాన్ని పెంచుతాయి. దానితోపాటు ఈ ప్రాంత సామాజిక, ఆర్థిక వృద్ధినీ మెరుగుపరుస్తాయి.
ఆరోగ్య రక్షణ సదుపాయాల కల్పనతోపాటు చౌక ధరల్లో వైద్యాన్ని అందించాలన్న ప్రధాని దార్శనికతలో భాగంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఔషధ పార్కుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం-కాకినాడ పెట్రోలియం, రసాయన, పెట్రోకెమికల్ పెట్టుబడి ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల ఆర్థిక వృద్ధి వేగవంతం కావడానికి దోహదపడుతుంది.
చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగంగా తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి (కేఆర్ఐఎస్ సిటీ) కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు. పర్యావరణ హిత అధునాతన పారిశ్రామిక నగరంగా ఇది రూపొందనుంది. తయారీ రంగంలో దాదాపు రూ. 10,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ప్రాజెక్టు సిద్ధంగా ఉంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగాలను కల్పిస్తుందని అంచనా. జీవనోపాధిని గణనీయంగా పెంపొందించడంతోపాటు ప్రాంతీయ పురోగతికి ఈ ప్రాజెక్టు చోదకంగా నిలుస్తుంది.
ఒడిశాలో ప్రధానమంత్రి
ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమావేశాన్ని ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రవాస భారతీయులతో అనుసంధానానికీ, వారితో భాగస్వామ్యానికీ, వారి మధ్య పరస్పర మైత్రిని పెంపొందించడానికీ ప్రవాసీ భారతీయ దివస్ వేదికవుతుంది. ఒడిశా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ నెల 8 నుంచి 10 వరకు భువనేశ్వర్ లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘వికసిత భారతానికి భారతీయ ప్రవాసుల తోడ్పాటు’’. 50కిపైగా దేశాల నుంచి భారత సంతతికి చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో ప్రవాసీ భారతీయ దివస్ లో పాల్గొనడం కోసం నమోదు చేసుకున్నారు.
భారతీయ ప్రవాసుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పర్యాటక రైలు అయిన ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ తొలి ప్రయాణాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఇది ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి మూడు వారాల పాటు దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలనూ, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలనూ చుట్టివస్తుంది. ప్రవాసీ తీర్థ దర్శన యోజన కింద ప్రవాసీ భారతీయ ఎక్స్ ప్రెస్ ను నిర్వహిస్తారు.
ఇక విశాఖలో ఆంధ్ర యూనివర్శిటీ గ్రౌండ్ లో రేపు జరగబోయే ప్రధాని మోడీ సభా ప్రాంగణాన్నిఎస్పీజీ ఇప్పటికే ఆధీనంలోకి తీసుకుంది.. ఇక ఇంజనీరింగ్ గ్రౌండ్ కు 2 కిలోమీటర్ల పరిధిలో స్థానిక ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.. బయట నుండి వచ్చే వ్యక్తులపై నిఘా ఉంచనున్నారు పోలీసులు.. ఇక, నేడు, రేపు సభా పరిసర ప్రాంతాల్ల్ నో ప్రయివేట్ డ్రోన్ ఫ్లై విధించారు.. ఈ నేఫథ్యంలో సభా ప్రాంగణంలో అయిదు వేల మంది పోలీసులు చేరుకున్నారు… 35 మంది ఐపీఎస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తున్నారు..
సిరిపురం దత్ ఐ ల్యాండ్ నుండి సభా ప్రాంగణం వరకు సుమారు 1.5 కిలో మీటర్ల రోడ్ షో జరగనుంది.. ఈ రోడ్ షో 45 నిముషాల పాటు కొనసాగనుంది. సభా ప్రాంగణం దగ్గరే కావడంతో ప్రజలకు అభివాధం చేస్తూ రోడ్ షో నెమ్మదిగా సాగనుంది.. రోడ్ షో లో మోడీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి పాల్గొనున్నారు.. ఉత్తరాంధ జిల్లాల నుండి సుమారు 3 లక్షల మంది ప్రజలు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు..
రోడ్ షోకు భారీ ఏర్పాట్లు…
విశాఖలో రేపు ప్రధాని నరేంద్ర మోడీ సభకు, రోడ్ షో కు చక చకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అన్ని కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు పాల్గొననున్నారు. దీంతో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లో నిమగ్నమయ్యారు అధికారులు.. మరో వైపు కూటమి నాయకులు వరుస సమీక్షలు నిర్వహిస్తు బిజీ బిజీగా కనిపిస్తున్నారు… రేపు సుమారు మూడు లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా ప్లానింగ్ చేస్తున్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి ప్రజల తరలింపుకు సుమారు 7000 వాహనాల కేటాయించారు.. సభకు హాజరయ్యే ప్రజల కోసం సుమారు 3 లక్షల ఆహార పొట్లాలు సిద్ధం చేయనున్నారు.. ప్రధాని టూర్ దృష్ట్యా రేపు ఉమ్మడి విశాఖలో పలు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. రూట్, రోప్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, డామినేషన్ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాట్లు ట్రైల్ రన్స్ జరుగుతున్నాయి..
డ్ షో కు సిద్ధమవుతున్న హోంమంత్రి అనిత ప్రచార రథం
భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం విశాఖపట్నంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని రోడ్ షో కోసం హోంమంత్రి వంగలపూడి అనిత వినియోగిస్తున్న ప్రచార రథం బాగుంటుందని నేతలు నిర్ణయించారు. దీంతో సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా అనిత వినియోగించిన ప్రచార రథాన్ని ముస్తాబు చేశారు. గత ఎన్నికల్లో మంత్రి అనిత ఎన్నికల ప్రచారంలో ఈ వాహనాన్నే ఉపయోగించి అఖండ మెజారిటీతో గెలుపొంది హోం మంత్రిగా నియమితులయ్యారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ఫోటోలతో అత్యంత ఆకర్షణీయంగా వాహనాన్ని డిజైన్ చేశారు. విశాఖలో రేపు వెంకటాద్రి వంటిల్లు నుంచి ఈ ప్రచార రథం నుంచే మోడీ రోడ్ షో లో ప్రజలకు అభివాదం చేయనున్నారు.