ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఎక్స్‌లో వేదికగా మండిపడ్డారు. చిన్న పిల్లల చిక్కీలు, గుడ్లు, మొదలుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వరకు గత ప్రభుత్వ బకాయిలు అక్షరాలా రూ.6,500 కోట్లు అని లోకేష్ తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మార్చి విద్యార్థుల భవిష్యత్తుతో జగన్ ఫుట్‌బాల్ ఆడారన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వల్లించడం మీకే చెల్లిందని… విద్యాదీవెన, వసతి దీవెన పేరుతో రూ.3500 కోట్ల బకాయిలు పెట్టి మోసం చేసిన కారణంగానే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అన్నారు.
నేను యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు మీ నిర్వాకాన్ని విద్యార్థులు నా దృష్టికి తీసుకొచ్చారు. వారికి ఇచ్చిన హామీ మేరకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సమస్యను పరిష్కరించామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ బకాయిలను వాయిదాల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని కళాశాలలకు ఆదేశించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము నేరుగా కాలేజీలకే చెల్లించాలని ఇటీవల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో జగన్ విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని… నాడు – నేడు అంటూ పబ్లిసిటీ పీక్కు తీసుకెళ్లారు కానీ విషయం వీక్ అని తేలిందని ఎద్దేవ చేశారు. అనాలోచిత, అవినీతి విధానాల కారణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు తగ్గారన్నారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వం వల్ల భ్రష్టు పట్టిన విద్యారంగాన్ని గాడిన పెట్టడం మా బాధ్యత అని… జగన్ చేసిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరిచేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం అని లోకేష్ అన్నారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటుంన్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మెరుగుపర్చేందుకు ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులను మెగా డిఎస్సీతో భర్తీచేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం అని వెల్లడించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ఏపీ విద్యా రంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని…. మీలాంటి వాళ్లు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా విద్యా సంస్కరణల విషయంలో మా అడుగు ముందుకే అని లోకేష్ అన్నారు.