(ప్రభ న్యూస్, విజయవాడ) : డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడకుండా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని.. అదే విధంగా సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేసి ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. శుక్రవారం విజయవాడ అర్బన్ పరిధిలోని రామకృష్ణాపురంలో విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తదితర విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఫ్రైడే-డ్రై డేలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను కలెక్టర్ సృజన పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ కింద చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వ్యాధులకు కారణం.. దోమ; ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించండి-నీటి నిల్వలను ఖాళీ చేయండి.. అంటూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపట్టిన ర్యాలీలోనూ పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ సృజన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని.. వీటి బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రెండుమూడు నెలలపాటు ర్యాలీలు వంటివి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బుడమేరులో నీటి ప్రవాహం సరిగా ఉండేలా ప్రత్యేక యంత్రాల సహాయంతో గుర్రపు డెక్క, తూటికాడలను తొలగించడం జరుగుతోందన్నారు. వర్షపునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చూసి.. వ్యాధులకు కారణమయ్యే దోమల బ్రీడింగ్ సోర్స్‌లను నాశనం చేయడంపైనా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తాగిపడేసిన కొబ్బరి బొండాలు, పాత టైర్లు, మొక్కల కుండీలు వంటివాటితో పాటు మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం ద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చన్నారు.
పంచాయతీరాజ్, మునిసిపల్, వైద్య ఆరోగ్య విభాగాలు వంటివి సీజనల్ వ్యాధుల కట్టడికి తమ బాధ్యతగా పెద్దఎత్తున నివారణ చర్యలు చేపడుతున్నాయని.. ప్రజలు కూడా భాగస్వాములై అవగాహన పెంపొందించుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సృజన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జ్ కమిషనర్ డా. ఎ.మహేశ్, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్టులు) కేవీ సత్యవతి, డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి తదితరులు పాల్గొన్నారు.