తిరుపతి రూరల్ (ప్రభ న్యూస్): తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు పుష్ప శ్రీవాణి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరి బాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..